Begin typing your search above and press return to search.

'ఎన్ డీఏ'కు కొత్త పేరు పెట్టిన కేటీఆర్ అదిరింది

By:  Tupaki Desk   |   2 Dec 2021 9:22 AM IST
ఎన్ డీఏకు కొత్త పేరు పెట్టిన కేటీఆర్ అదిరింది
X
ఆగ్రహానికి ఆవేశం తోడైతే? దానికి రాజకీయం కలిస్తే.. తాజాగా కేటీఆర్ ట్వీట్ అవుతుంది. కేంద్రంలోని మోడీ సర్కారు తీరును తీవ్రంగా పరిగణిస్తున్న కేసీఆర్ సర్కారు.. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవటానికి సిద్ధంగా లేదు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైనంపై మండిపడుతోంది. రైతు పండించే ప్రతి ధాన్యపు గింజను కొంటామని ధీమాగా చెప్పే కేసీఆర్ మాటల వెనుక కేంద్రం ఉంటుందన్న విషయం తాజా పరిణామాల నేపథ్యంలో అందరికి అర్థం కావటం ఒక ఇబ్బంది అయితే.. ఇంత జరిగిన తర్వాత కూడా పెరిగిన పంట దిగుబడిని కేంద్రాన్ని ఒత్తిడి పెట్టి కొనిపించే విషయంలో విఫలం కావటం కేసీఆర్ అండ్ కోకు మండిపాటుగా మారింది.

ఇలాంటి వేళ.. కేంద్ర మంత్రి ఒకరు లోక్ సభలో ఇచ్చిన సమాధానంపై మండిపాటు ట్వీట్ ను పోస్టు చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఏడాదికి పైనే దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో ధర్నా చేసి మరణించిన రైతుల వివరాలు తమ వద్ద లేవని.. వారికి పరిహారం అందించే అవకాశం అంతకన్నా లేదంటూ పార్లమెంటులో మోడీ సర్కారు చెప్పిన తీరుపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మోడీ నాయకత్వంలోని ఎన్ డీఏ సర్కారుకు ఆయన కొత్త పేరు పెట్టి ట్వీట్ చేశారు. అదిప్పుడు వైరల్ గా మారింది.

ఎన్ డీఏ అంటే.. 'నో డేటా అవెలేబుల్' (సమాచారం అందుబాటులో లేదు) అంటూ వ్యంగ్యంగా విరుచుకుపడ్డారు. ఏ సందర్భంలో అయినా సరే సమాచారాన్ని కేంద్రాన్ని అడిగితే.. దాని నుంచి వచ్చే సమాచారం ఇదే కావటం అంటూ ఎద్దేవా చేశారు. మోడీ సర్కారు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గళమెత్తిన రైతు ఉద్యమంలో.. ఇప్పటివరకు 750కు పైగా రైతులు మరణించటం.. వారందరికి రూ.3 లక్షల చొప్పున తెలంగాణ రాష్ట్రం తరఫున పరిహారాన్ని ప్రకటించటం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాల గురించి కేంద్రాన్ని అడగ్గా.. తమ వద్ద ఆందోళనల్లో మరణించిన రైతుల వివరాలు లేవని చెప్పారు.

ఇందుకు స్పందించిన కేటీఆర్.. ఎన్ డీఏ ప్రభుత్వం అంటే నో డేటా అవైలబుల్ గవర్నమెంట్ గా పేర్కొంటూ.. ఇదొక్క విషయంలోనే కాదు.. పలు సందర్భాల్లో ఇలాంటి సమాధానాన్నే ఇచ్చారన్నారు. కేంద్రం వద్ద ఏ డేటా అందుబాటులో ఉండదన్న ఆయన అందుకు సాక్ష్యంగా కొన్ని వార్తా క్లిప్పింగ్ లను తన ట్వీట్ కు జత చేశారు. మరణించిన రైతులవే కాదు.. ఆరోగ్య సేవలు అందించే స్టాఫ్ మరణాలు..లాక్ డౌన్ వేళ తమ స్వస్థలాలకు తరలి వెళ్లేందుకు వలస కార్మికుల కాలి నడకన వెళుతూ పెద్ద ఎత్తున మరణించటం.. వారికి సంబంధించిన వివరాల్ని అడగ్గా.. తమ వద్ద ఎలాంటి డేటా లేదని చెప్పటంలో అప్పట్లో తీవ్ర విమర్శలకు గురైంది. ఆ అంశాల్ని గుర్తు చేస్తూ.. ఏన్ డీఏ సర్కారుకు పంచ్ వేసేలా కేటీఆర్ ట్వీట్ మారింది.

ఎన్ డీఏ - నో డేటా ఎవైలబుల్ గవర్నమెంట్
- మరణించిన హెల్త్ కేర్ సిబ్బంది డేటా ఉండదు
- కోవిడ్ వేళ మూతపడిన చిన్న పరిశ్రమల డేటా ఉండదు
- వలసకూలీల మరణాలకు సంబంధించిన డేటా ఉండదు
- కొవిడ్ వేళ ఉద్యోగాలు కోల్పోయిన వారికి సంబంధించిన డేటా ఉండదు
- రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ లబ్థిదారుల డేటా ఉండదు
- వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ఆందోళనల్లో మరణించిన రైతుల డేటా ఉండదు