Begin typing your search above and press return to search.

కాకా కొడుకును బుట్ట‌లో ప‌డేసిన కేటీఆర్

By:  Tupaki Desk   |   4 Nov 2018 12:24 PM IST
కాకా కొడుకును బుట్ట‌లో ప‌డేసిన కేటీఆర్
X
టీఆర్ ఎస్ త‌ర‌ఫున చెన్నూరు టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ మాజీ మంత్రి - కాకా కుమారుడు గ‌డ్డం వినోద్ కుమార్ ఎట్ట‌కేల‌కు శాంతించారు. కాంగ్రెస్‌ లో చేరే ప్ర‌య‌త్నాల‌ను దాదాపుగా విర‌మించుకున్నారు. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ త‌ర‌ఫున ఆయ‌న కుమారుడు కేటీఆర్ నుంచి ఓ స్ప‌ష్ట‌మైన హామీ ల‌భించ‌డమే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

తెలంగాణ ద‌ళిత నేత‌ల్లో కాకా ప్ర‌ముఖులు. ఆయ‌న కుమారులు వినోద్‌ - వివేక్ తండ్రి నుంచి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. త‌మ ప్రాంతంలో కీల‌క నేత‌లుగా ఎదిగారు. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున వినోద్ రాష్ట్ర మంత్రిగా ప‌నిచేయ‌గా.. వివేక్ ఎంపీగా విధులు నిర్వ‌ర్తించారు. తెలంగాణ ఆవిర్భావం అనంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో ఇద్ద‌రూ గులాబీ పార్టీలో చేరారు. తాజాగా ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ త‌ర‌ఫున వినోద్ చెన్నూరు టికెట్‌ ను ఆశించారు. ఆయ‌నకు ఆశాభంగం చేస్తూ ఆ టికెట్‌ ను ఎంపీ బాల్క సుమ‌న్‌ కు కేసీఆర్ కేటాయించారు.

టీఆర్ ఎస్‌ లో టికెట్ నిరాక‌ర‌ణ‌తో వినోద్‌ తీవ్రంగా నొచ్చుకున్నారు. కాంగ్రెస్ లేదా తెలంగాణ జ‌న స‌మితి(టీజేఎస్‌) పార్టీల్లో చేరి చెన్నూరు లేదా పెద్ద‌ప‌ల్లి శాస‌న‌స‌భ స్థానంలో పోటీ చేసే అవ‌కాశాల‌ను ప‌రిశీలించారు. ఇందులో భాగంగానే రెండు రోజులు ఢిల్లీ వెళ్లి.. కాంగ్రెస్ పెద్ద‌ల‌తో మంత‌నాలు జ‌రిపారు.

టీఆర్ ఎస్‌ పై ఇప్ప‌టికే కొంత ద‌ళిత వ్య‌తిరేక ముద్ర ఉన్న నేప‌థ్యంలో వినోద్ వెళ్లిపోతే ఆ ముద్ర మ‌రింత బ‌ల‌ప‌డే ప్ర‌మాద‌ముంద‌ని కేసీఆర్ భావించారు. అందుకే ఆయ‌న నిష్క్ర‌మ‌ణ‌ను ఆపేందుకుగాను ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు వినోద్‌ కు క‌బురు పంపారు. దీంతో ఢిల్లీ నుంచి వెన‌క్కి వ‌చ్చిన వినోద్‌ తో కేటీఆర్ భేటీ అయ్యారు. త‌న తండ్రి మ‌న‌సులోని ఆలోచ‌న‌ను - హామీని స్ప‌ష్టంగా తెలియ‌జేశారు. దీంతో పార్టీని వీడ‌టంపై వినోద్ మ‌న‌సు మార్చుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయంగా తెలిసింది. ఇక‌పై పార్టీ కోసం ప‌నిచేస్తాన‌ని.. చెన్నూరు - పెద్ద‌ప‌ల్లి - మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్ర‌చారానికి వెళ్తాన‌ని కేటీఆర్‌ కు ఆయ‌న భ‌రోసా ఇచ్చిన‌ట్లు స‌మాచారం.