Begin typing your search above and press return to search.

కరోనా వేళ అందరూ డాక్టర్లు అయ్యారు.. అదిరేలా కేటీఆర్ పంచ్

By:  Tupaki Desk   |   27 April 2020 4:40 AM GMT
కరోనా వేళ అందరూ డాక్టర్లు అయ్యారు.. అదిరేలా కేటీఆర్ పంచ్
X
కరోనా వేళ.. చుట్టూ చోటు చేసుకుంటున్న మార్పుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. వైరస్ వ్యాప్తికి చెక్ చెప్పేందుకు ప్రతి ఒక్కరూ సలహాలు.. సూచనలు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించే క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కరోనా వేళ.. చోటు చేసుకున్న మార్పుల్ని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.

కరోనా పుణ్యమా అని అందరూ డాక్టర్లు అయ్యారంటూ కాస్తంత వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. తనకొచ్చే వాట్సాప్ సందేశాలు.. సలహాలు చూస్తుంటే నెత్తి తిరిగి.. పాడైపోతుందన్నారు. చివరకు తన కుమార్తె.. కొడుకు కూడా డాక్టర్లు అయిపోయారన్నారు. సినిమా యాక్టర్లు కూడా చెబుతున్నారంటూ టైమ్లీగా చురకేశారు. కరోనా ప్రభావం ఎప్పటి వరకూ ఉంటుందన్న విషయాన్ని చెప్పలేకపోయిన కేటీఆర్.. వ్యాక్సిన వచ్చే వరకూ జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఇప్పటివరకూ వ్యక్తిగత శుభ్రత అన్నది అంశంగా లేదని..ఇప్పుడు అందరి ఇళ్లల్లో మార్పులు వచ్చేశాయన్నారు. కరోనా కారణంగా మంచి మార్పులు వచ్చాయని చెప్పారు. లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉంటుందన్న విషయాన్ని చెప్పలేనని చెప్పేయటం గమనార్హం.

రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి ఆ విజయాన్ని ఏదోకారణంగా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నట్లు చెప్పిన కేటీఆర్.. పార్టీ ఆవిర్భావ దినోత్సం నేపథ్యంలో కార్యకర్తలు ఇళ్ల మీద జెండాలు ఎగరేయాలని.. ఏరియా ఆసుపత్రులు.. బ్లడ్ బ్యాంకుల్లో రక్తదానం చేయాలన్నారు. సీఎంఆర్ఎఫ్ కు విరాళాలు ఇవ్వాలని.. పేదలకు సాయం చేయాలన్నారు.

కరోనా వేళ.. ఎక్కువ పరీక్షలు చేయటం లేదన్న విమర్శ పైనా కేటీఆర్ స్పందించారు. ఎక్కువ టెస్టులు చేస్తే ఏమైనా ప్రైజులు ఇస్తారా? అని ప్రశ్నించిన ఆయన.. ఎంత అవసరమో అంత చేస్తామని.. ఆ విషయంలో తాను పండితున్ని కాదని.. ఇదే విషయాన్ని మంత్రి ఈటెలతో మాట్లాడితే.. మరింతగా క్లారిటీ ఇస్తారంటూ తెలివిగా తప్పుకోవటం విశేషం. ఏ విషయానికి ఎంతమేర రియాక్టు కావాలన్న విషయంలో తనకున్న ప్రావీణ్యాన్ని తాజా ఇంటర్వ్యూలో మరోసారి ప్రదర్శించారు మంత్రి కేటీఆర్.