Begin typing your search above and press return to search.

కేటీఆర్ నోట జగన్ మాట!

By:  Tupaki Desk   |   9 May 2020 9:30 PM IST
కేటీఆర్ నోట జగన్ మాట!
X
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. కరోనా మహమ్మారి కట్టడి కోసం ఎన్ని గట్టి చర్యలు తీసుకుంటున్నా కూడా కరోనా కంట్రోల్ లోకి రావడం లేదు. లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేస్తున్నప్పటికీ కరోనా భాదితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం కూడా ఆలోచనలో పడిపోతుంది. తెలంగాణలో లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేయడంతో రాష్ట్రంలో కొంతవరకు తగ్గినట్టుగానే కనిపిస్తున్నా కూడా ..ప్రస్తుత పరిస్థితులని అంచనా వేసి కరోనా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు మంత్రి కేటీఆర్.

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. పట్టణాల్లో సరి, బేసి విధానంలో దుకాణాల నిర్వహణను పర్యవేక్షించాలని చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం ఇప్పట్లో తగ్గేలా లేదని, వ్యాక్సిన్‌ వచ్చేవరకు కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి తప్పేలా లేదని చెప్పారు. రాష్ట్రంలో దశలవారీగా లాక్‌ డౌన్‌ ఎత్తేసినా తర్వాత కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశమే ఎక్కువగా ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

కరోనా కట్టడికి అవసరమైన మార్గదర్శకాలను ఆరోగ్య, పురపాలకశాఖలు విడుదల చేస్తాయని వెల్లడించారు. మాస్కుల వినియోగం, -భౌతికదూరం పాటించడం - శానిటైజర్ల వినియోగాన్ని యథాతథంగా కొనసాగించాలని సూచించారు.హైదరాబాద్‌ లోని జీహెచ్‌ ఎంసీ ప్రధాన కార్యాలయంలో పురపాలక శాఖపై మంత్రి కేటీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడిలో కీలకపాత్ర వహిస్తున్న మున్సిపల్‌ కమిషనర్లను మంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తితో కరోనా కట్టడికి భవిష్యత్తులోనూ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ భేటీలో మాన్సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ పైనా మంత్రి సమీక్ష జరిపారు.