Begin typing your search above and press return to search.

చిరు ఛాలెంజ్ కు నో చెప్పేసిన కేటీఆర్

By:  Tupaki Desk   |   27 April 2020 9:20 AM IST
చిరు ఛాలెంజ్ కు నో చెప్పేసిన కేటీఆర్
X
ప్రశ్న ఏదైనా.. సమాధానం చెప్పే విషయంలో కొలతలో ఏ మాత్రం తేడా రాకుండా చూసుకునే టాలెంట్ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు కాస్త ఎక్కువే. సరదాగా అయినా.. సీరియస్ గా అయినా ఆయన నోటి నుంచి వచ్చే మాటలు ఆసక్తికరంగా సాగుతుంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒక నెటిజన్ చేసిన ట్వీట్.. దానికి కేటీఆర్ ఇచ్చిన సమాధానం అందరిని విపరీతంగా ఆకర్షించిన సంగతి తెలిసిందే.

సెలూన్లు త్వరగా ఓపెన్ చేయించాలని.. లేదంటే తన భార్య కటింగ్ చేస్తానని చెబుతుందని.. అదే జరిగితే తాను లాక్ డౌన్ తర్వాత బయటకు రాలేనన్న నెటిజన్ ట్వీట్ కు కేటీఆర్ స్పందిస్తూ.. కోహ్లీ అంతటోడే తన తలను భార్యకు అప్పజెప్పారంటూ సరదాగా రియాక్ట్ అయ్యారు. దీనికి బదులుగా కేటీఆర్ చెల్లెలు కవిత సరదాగా స్పందిస్తూ.. బ్రదర్.. వదినకు కటింగ్ చేసే ఛాన్సు ఎప్పుడిస్తావ్ అంటూ చేసిన వ్యాఖ్య అందరిని అమితంగా ఆకర్షించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో కటింగ్ అంశం ప్రశ్న రూపంలో ఎదురైంది. మెగాస్టార్ చిరంజీవి విసిరిన బీ ద రియల్ మ్యాన్ సవాలును తాను స్వీకరించలేదన్న మంత్రి కేటీఆర్.. తన హెయిర్ కటింగ్ బాధ్యతను తన భార్యకు అప్పగించే ఆలోచన లేదన్నారు. ముందుగా తన కొడుకు.. కూతురు మీద ప్రయోగం చేయాలని తాను ఆమెకు చెప్పినట్లుగా చెప్పారు. వారికొచ్చిన ఫలితం చూసిన తర్వాత ఆమెతో హెయిర్ కటింగ్ చేయించుకోవాలో? వద్దో? అన్నది ఆలోచిస్తానని చెప్పటం విశేషం. మొత్తానికి తన తలను భార్యకు అప్పగించే విషయంలోనూ కేటీఆర్ ఎంత జాగ్రత్తగా ఉన్నారో కదూ?