Begin typing your search above and press return to search.

ఇవాంకా ట్రంప్ మంత్రిని అంటున్న కేటీఆర్‌

By:  Tupaki Desk   |   29 Nov 2017 1:56 PM GMT
ఇవాంకా ట్రంప్ మంత్రిని అంటున్న కేటీఆర్‌
X
మంత్రిగా ఎంత బిజీగా ఉంటారో..సోష‌ల్ మీడియాలో కూడా అంతే బిజీగా ఉండే కేటీఆర్ స‌ర‌దా సంభాష‌ణ‌ల‌కు కూడా అప్పుడప్పుడూ చోటిస్తుంటారు. త‌నపైనే తాను అప్పుడ‌ప్పుడూ సెటైర్ కూడా వేస్తుంటారు. అలా ఓ భారీ సెటైర్‌ను కేటీఆర్ తనంత తానుగా వేసుకున్నారు. గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ స‌మ్మిట్‌లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖా మంత్రి కేటీఆర్ ఇవాళ జీఈఎస్ సదస్సులో కొంత సరదా చేశారు. రెండవ రోజు జీఈఎస్ సదస్సులో భాగంగా ఇవాళ ప్లీనరీ జరిగింది. దానికి మంత్రి కేటీఆర్ మాడరేటర్‌గా వ్యవహరించారు. ఈ ప్లీనరలో ప్యానలిస్టులుగా ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, ఇవాంకా ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్‌లు ఉన్నారు.

ఈ చ‌ర్చ‌లో భాగంగా మొదట ఐసీఐసీఐ సీఈవో చందా కొచ్చార్‌ను మంత్రి కేటీఆర్ వేదిక మీదకు ఆహ్వానించారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్‌ను కూడా మంత్రి ఆహ్వానించారు. అయితే ఇవాంకాను పరిచయం చేసే సమయంలో మంత్రి కేటీఆర్ కొంత చమత్కారాన్ని ప్రదర్శించారు. తాను రాష్ట్రానికి ఐటీ మంత్రిని అని, కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఐటీ నామస్మరణ జరుగుతున్నదని, ఐటీ అంటే `ఇవాంకా ట్రంప్` అని మంత్రి కేటీఆర్ నవ్వులు పూయించారు. మహిళా పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఈ ప్లీనరీని నిర్వహిస్తున్నారు.

మ‌రోవైపు అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొన్న ఇవాంకా ట్రంప్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. చాలా గొప్ప పని చేశావంటూ తన సలహాదారు, కూతురు అయిన ఇవాంకాను డోనాల్డ్ ట్రంప్ మెచ్చుకున్నారు. గ్రేట్‌వర్క్ ఇవాంకా అంటూ ఆయన ఇవాళ ఓ ట్వీట్ చేశారు. జీఈఎస్‌లో మొదటి రోజు సదస్సుకు వచ్చిన ప్రతినిధులను ఉద్దేశించి ఇవాంకా మాట్లాడారు. మహిళలు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే విధంగా తమ ప్రభుత్వం విధానాలను రూపొందిస్తోందని ఇవాంకా ఆ ప్రసంగంలో పేర్కొన్నారు. వర్క్‌ఫోర్స్, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం అమెరికా ప్రభుత్వం అనేక విధానాలను అమలు చేస్తున్నదని ఆమె అన్నారు. తమ కలలను తమ భవిష్యత్తుగా మార్చుకునేందుకు మహిళా వ్యాపారవేత్తలకు సహాకారం అందిస్తున్నామని ఇవాంకా ఆ ప్రసంగంలో తెలిపారు.