Begin typing your search above and press return to search.

కేసీఆర్ స‌ర్వేల లాజిక్ చెప్పిన కేటీఆర్‌

By:  Tupaki Desk   |   2 Jun 2017 3:02 AM GMT
కేసీఆర్ స‌ర్వేల లాజిక్ చెప్పిన కేటీఆర్‌
X
తెలంగాణ మూడో రాష్ర్టావతరణ దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అనేక అంశాల‌పై త‌న అభిప్రాయాలు - రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను పంచుకున్నారు. రాజ‌కీయాల నుంచి మొద‌లుకొని టీఆర్ ఎస్ అంత‌ర్గ‌త రాజ‌కీయాలు - ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఐటీ ట్రెండ్స్ వ‌ర‌కు త‌న‌దైన శైలిలో విశ్లేషించారు. అమెరికా అధ్యక్ష పీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ అధిరోహించాక మన ఐటీ ఉద్యోగాలు పోతాయన్న విషప్రచారం జరుగుతోంద‌ని కానీ ఇదే సమయంలో మన దేశంలో ఐటీ రంగం పది శాతం వృద్ధి చెందిందని గ‌మ‌నించాల‌ని కేటీఆర్ అన్నారు. తెలంగాణ‌లో 13 శాతం వృద్ధి ఉందని తెలిపారు. ఐటీ సంస్థల్లో కొత్త ఉద్యోగుల్ని తీసుకోవడం, పాత ఉద్యోగుల్ని తీసివేయడం సర్వసాధారణమ‌ని కేటీఆర్ తేల్చేశారు. ఎవరే ప్రచారాలు చేసినా వచ్చే దశాబ్దంలో ప్రపంచంలో భారత్‌దే హవా అని ధీమా వ్య‌క్తం చేశారు. ఐఐటీ - ఐఐఎం విద్యార్థులు మేధస్సుకి పదును పెట్టి సరికొత్త స్టార్టప్‌ లను ఆవిష్కరిస్తున్నారని, వచ్చే పదేళ్ల‌లో ప్రపంచానికి అద్భుతమైన ఆవిష్కరణలను మన దేశం అందించనుందని ధీమా వ్య‌క్తం చేశారు. అందులో సింహభాగం తెలంగాణ నుంచి ఉండాలన్నదే త‌న‌ ప్రయత్నమ‌ని తెలిపారు.

సీఎం కేసీఆర్ తరుచూ సర్వేలను నిర్వహించడానికి ప్రధాన కారణమేమిటని ప్ర‌శ్నించ‌గా మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం ఇచ్చారు. ``ఏ రాజకీయ పార్టీ అయినా తన పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా? లేవా? నాయకులు ప్రజలకు అందుబాటులో ఉన్నారా? లేదా? అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటే పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ఈ క్ర‌మంలోనే ఇప్పటివరకూ మూడు సర్వేలను నిర్వహించాం. మా పనితీరును మేము బేరీజు వేసుకోవడానికి సర్వే నిర్వహించుకుంటే దానిని భూతద్దంలో చూడడం సరికాదు`` అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మీ పరిస్థితి ఏమిట‌ని ప్ర‌శ్నించ‌గా...``ప్రజలు అవకాశమిస్తే గెలుస్తాం. అంతేగాని మా వరకు ఎన్నికలనేవి జీవన్మరణ సమస్య కాదు. రాహుల్ గాంధీలు, అమిత్‌ షాలు వస్తారు. ఇదంతా ప్రజాస్వామ్యంలో భాగం. మాకైతే ప్రజల మీద విశ్వాసముంది. పదిహేనేళ్ల‌ క్రితం మా నాయకుడు తెలంగాణ కోసం బయల్దేరితే అంతా సాధ్యం కాదన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడింది. తర్వాత బంగారు తెలంగాణ సాధ్యం కాదన్నారు. మూడేళ్లుగా స్వచ్ఛమైన పాలనను అందిస్తున్నాం. దీన్ని కొనసాగిస్తాం. మాకు అధికారం మీద రంది లేదు. గెలుపు విషయం ప్రజలు నిర్ణయిస్తారు`` అని వ్యాఖ్యానించారు.

ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పని చేశాం తప్ప పదవుల కోసం కాదని కేటీఆర్ వివ‌రించారు. అనుకోకుండా అవకాశం వచ్చిందని దీంతో రాత్రింబవళ్లు కష్టిస్తున్నామ‌ని తెలిపారు. పార్టీలో తాను ఏ నంబర్ అన్నది అప్రస్తుతమ‌ని కేటీఆర్ తెలిపారు. తామంతా సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అయినా, నెంబర్ల గురించి మాట్లాడటానికి మేం ఫుట్ బాల్ మ్యాచులను ఆడటం లేదు కదా అంటూ చ‌మ‌త్క‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/