Begin typing your search above and press return to search.

బాబుగారి భద్రత ఖర్చు సారు సర్కారుదేనంట

By:  Tupaki Desk   |   18 March 2015 10:37 AM IST
బాబుగారి భద్రత ఖర్చు సారు సర్కారుదేనంట
X
అజన్మ విరోధం అన్నట్లుగా వ్యవమరిస్తూ.. తెలుగుదేశం పార్టీ నీడను కూడా భరించలేని స్థాయికి తెలంగాణ అధికారపక్షం చేరుకోవటం తెలిసిందే. ఆ పార్టీ అధినేత మొదలు.. ఆ పార్టీ రంగును కూడా వ్యతిరేకించే టీఆర్‌ఎస్‌ సర్కారు.. అదే బాబుకు సంబంధించిన ఖర్చును భారీగానే భరించటం కాస్త విశేషంగా చెప్పాలి.

ఆ విషయాన్ని ఎవరో కాదు.. బాబు పేరు వినిపించినంతనే విరుచుకుపడే కేటీఆర్‌.. తనకు తానుగా చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అతిధి అని చెప్పారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం.. మర్యాద ఇస్తున్నామని వ్యాక్యానించారు.

ఏపీకి చెందిన అంగన్‌వాడీల ఆందోళన.. అరెస్టు చేయటం.. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేయటంపై మాట్లాడిన కేటీఆర్‌.. తమ రాష్ట్రంలో ఉన్న అతిధికి ఇబ్బంది కలగకుండా గట్టి చర్యలు తీసుకున్నామన్నారు. తెలంగాణలో అతిధిగా పాలన చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు సర్కారుకు నిరసనగా నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేయకపోతే.. తెలంగాణ ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో విఫలమైందని ఆరోపిస్తారన్నారు.

ఈ కారణంతోనే తగిన రక్షణ ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. అసెంబ్లీతో పాటు.. మదీనాగూడలో ఉన్న బాబు ఫామ్‌హౌజ్‌కు కూడా భద్రత కల్పించినట్లు వెల్లడించారు. సెక్యూరిటీ సిబ్బందికి అవసరమైన భోజనం.. వసతులకు సంబంధించిన ఖర్చును తెలంగాణ సర్కారే భరిస్తుందన్న విషయాన్ని కేటీఆర్‌ తన మాటలతో చెప్పకనే చెప్పేశారు.