Begin typing your search above and press return to search.

సరదాగా జోక్ వేస్తే ఇంత గోల చేస్తారా?

By:  Tupaki Desk   |   10 Jan 2016 4:37 AM GMT
సరదాగా జోక్ వేస్తే ఇంత గోల చేస్తారా?
X
ఎవరూ మాట పడటానికి సిద్ధంగా లేని కాలం. ఆచితూచి మాట్లాడాల్సిన రోజుల్లో సరదాకు.. జోకులకు పబ్లిక్ మీటింగ్ లు వేదిక కాదన్న విషయాన్ని రాజకీయ నాయకులు మర్చిపోకూడదు. ఇంట్లోని వాళ్లను అన్నట్లుగా.. ఒక ప్రాంతానికి చెందిన వారినో.. ఒక వర్గానికి చెందిన వారినో అనేసే రోజులు పోయాయి. నిజానికి ఇంట్లో వాళ్ల మీద జోకులు వేస్తేనే మూతి ముడుచుకునే సున్నిత మనస్కుల కాలమిది. అలాంటప్పుడు ఒక ప్రాంతానికి చెందిన వారిని.. అందునా మనస్పర్థలున్న వారి విషయంలో మరింత జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఆచితూచి మాట్లాడాల్సింది పోయి.. ఇష్టారాజ్యంగా మాట్లాడేయటం ఏ మాత్రం సరికాదు. అయితే.. ఇవేమీ పట్టించుకోకుండా.. సుదీర్ఘకాలం తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం కోసం పోరాటం చేసిన టీఆర్ ఎస్ కు చెందిన కేటీఆర్ లాంటి నేత.. తాజాగా భీమవరం వాసుల విషయంపై చేసిన వ్యాఖ్యలు విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే.

తమ పార్టీని ఏపీకి విస్తరిస్తామంటూ సరదాగా జోకులేసినట్లుగా చెబుతున్న కేటీఆర్.. ఆ సందర్భంగా.. అదే జోకులో భీమవరం వాసుల మనోభావాలు దెబ్బ తినేలా వ్యాఖ్యలు చేయటంపై పలువురు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను అన్న మాటలపై రాజకీయ నేతలు మాటల దాడి చేస్తున్న నేపథ్యంలో.. తాను సరదాగా జోకితే కూడా ఇంత రార్థాంతమా? అంటూ విస్మయాన్ని వ్యక్తం చేశారు కేటీఆర్.

తాజాగా ఒక సభకు హాజరైన ఆయన.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని తెలుగు రాష్ట్ర సమితిగా మారుస్తామని.. ఏపీకి పార్టీని విస్తరిస్తామంటూ సరదాగా జోకేస్తే.. రాజకీయ పార్టీలు విమర్శలు చేయటం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. సరదాగా జోకేస్తే.. ఇంత రార్థాంతం చేస్తారా? అంటూ మండిపడుతున్నారు. తాను చేసే వ్యాఖ్యలు జోకులుగా సింఫుల్ గా తేల్చేసే కేటీఆర్ లాంటి వాళ్లకు.. ఎదుటోళ్లు చేసే వ్యాఖ్యలు మాత్రం జాతి ఆత్మాభిమానం దెబ్బ తీయటంలా ఎందుకు కనిపిస్తాయి..?