Begin typing your search above and press return to search.

నాగ్ కు గిఫ్టులు ఇవ్వనన్న కేటీఆర్

By:  Tupaki Desk   |   17 Jan 2017 11:39 PM IST
నాగ్ కు గిఫ్టులు ఇవ్వనన్న కేటీఆర్
X
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారీ ఏదో ఒక రకంగా సినీనటుడు నాగార్జున ఇష్యూ రావటం మామూలైంది. మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసేందుకు వీలుగా విపక్ష నేతలు నాగ్ ప్రస్తావన తీసుకురావటం.. దానికి మంత్రి కేటీఆర్ వివరణ ఇవ్వటం మామూలుగా మారింది. మొన్నామధ్య అసెంబ్లీ సమావేశాల్లో ఎన్ కన్వెన్షన్ గురించి.. దాని అక్రమ నిర్మాణాల గురించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించిన టీటీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి.. తాజాగా మరోసారి ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు.

నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ పైన తెలంగాణ సర్కారు స్పష్టత ఇవ్వాలన్న రేవంత్.. గతంలోనూ ఎన్ కన్వెన్షన్ కట్టటం పైన పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయన్నారు. నాగార్జున సర్కిల్ లోట్రాఫిక్ జాం అవుతోందని.. అక్కడ మల్టీఫ్లెక్స్ కు అనుమతులు ఇవ్వొద్దన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని.. వాటిపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవటం లేదో చెప్పాలంటూ నిలదీశారు. ఎమ్మార్ ప్రాపర్టీకి దగ్గరగా ఉన్న 450 ఎకరాల ప్రభుత్వ భూమిని తీసుకోవాలని.. అదే జరిగితే అక్కడ లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టొచ్చన్నారు.

రేవంత్ సంధించిన ప్రశ్నాస్త్రాలకు సమాధానం ఇచ్చిన మంత్రి కేటీఆర్.. ఎన్ కన్వెన్షన్ కు.. నాగార్జునకు గిఫ్టులు ఇచ్చే సంస్కృతి తమది కాదని స్పష్టం చేశారు. ఎవరికి ఎలాంటి వెసులుబాటు ఇవ్వమని చెప్పిన ఆయన చట్టప్రకారం ఏం జరుగుతుందో అదే చేస్తామన్నారు. నాగార్జున సర్కిల్లో మల్టీఫ్లెక్స్ కట్టే విషయం తమ దృష్టికి రాలేదన్న ఆయన.. ఒకవేళ తమ దృష్టికి వస్తే.. ఆ సంగతి చూస్తామన్నారు. ఎమ్మార్ గురించిన సమాచారం తన దగ్గర లేదన్న కేటీఆర్ తనకు తెలియని విషయంపై తెలీదనే చెబుతానని.. సమాచారం వచ్చాక తెలుసుకొని చెబుతానని వ్యాఖ్యానించారు. నాగార్జున సర్కిల్ లాంటి ప్రైమ్ లొకాలిటీలో నిర్మిస్తున్న మల్టీఫ్లెక్స్ గురించి మంత్రి కేటీఆర్ దగ్గర సమాచారం లేదా? నమ్మాల్సిందేనా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/