Begin typing your search above and press return to search.

హైదరాబాద్ హాస్టళ్లలోని వారు ఆందోళన చెందవద్దు: కేటీఆర్

By:  Tupaki Desk   |   25 March 2020 3:08 PM GMT
హైదరాబాద్ హాస్టళ్లలోని వారు ఆందోళన చెందవద్దు: కేటీఆర్
X
హైదరాబాద్‌ లోని హాస్టల్స్‌ లో ఉంటున్నవారు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని - భయపడాల్సిన అవసరం లేదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హాస్టల్స్ నిర్వాహకులు భయపడి ఎవరిని కూడా ఖాళీ చేయించవద్దని విజ్ఞప్తి చేశారు. హాస్టల్స్‌ లో ఉంటున్న వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని జీహెచ్ ఎంసీ కమిషనర్ - హైదరాబాద్ సీపీలను కోరినట్లు తెలిపారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో అమీర్‌ పేట - ఎస్సార్ నగర్ - దిల్‌ సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉండే వారిని యాజమాన్యం ఖాళీ చేయించింది. చాలా హాస్టల్స్ నిన్న రాత్రి నుండే ఖాళీ చేయించడం ప్రారంభించాయి. దీంతో హాస్టళ్లలోని వారు ఇబ్బందులు పడ్డారు. పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు. చాలామందికి పోలీసులు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ఇచ్చి 24 గంటల్లో మీ మీ గ్రామాలకు చేరుకోవాలని సూచించారు. ఆ మేరకు దారి మధ్యలో ఎవరూ ఆపకుండా - ఆపినా NOC చూపిస్తే వదిలేసాలా రాసిచ్చారు.

విద్యార్థినులు - ఉద్యోగినులతో పాటు కొంతమంది దూరప్రాంతం వారు వెళ్లేందుకు ఎలాంటి మార్గాలు లేవు. దీంతో వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ వారికి ఊరట కల్పించేలా ట్వీట్ చేశారు. వారిని హాస్టల్ యాజమాన్యం ఖాళీ చేయించవద్దని - అలాగే జీహెచ్ ఎంసీ కమిషనర్ - హైదరాబాద్ సీపీ వెంటనే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

కొంతమంది దూరప్రాంతాల వారు ఉన్నారని - వారిని స్పెషల్ బస్సులలో పంపించే ఏర్పాటు చేయాలని కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు. కర్ఫ్యూ వల్ల హాస్టల్స్ బంద్ చేయడం సరికాదని, ఒకవేళ బంద్ చేయిస్తే మాకు సౌకర్యాలు కల్పించాలని, కొంతమందికి హాస్టల్స్‌ లో రెండు మూడు రోజులుగా ఏ సౌకర్యాలు కల్పించడం లేదని బాధితులు ట్వీట్ చేస్తున్నారు. ఈ సమయంలో కేటీఆర్ స్పందించారు