Begin typing your search above and press return to search.

కేటీఆర్ సాయానికి కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ ట్వీట్ వినతి.. రియాక్షన్ ఇదే

By:  Tupaki Desk   |   31 May 2021 10:18 AM IST
కేటీఆర్ సాయానికి కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ ట్వీట్ వినతి.. రియాక్షన్ ఇదే
X
ఆఫ్ లైన్ లోనూ.. ఆన్ లైన్ లోనూ యాక్టివ్ గా ఉండటం అందరికి కుదిరే పని కాదు. అందులోనూ రాజకీయాల్లో ఉన్న వారికి ఈ రెండింటిని బ్యాలెన్సు చేయటం ఇబ్బందే. అందునా.. ముఖ్యమంత్రి కుమారుడిగా.. మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న క్రెడిట్ ను సొంతం చేసుకున్నారు టీ మంత్రి కేటీఆర్. కొవిడ్ వేళ.. పలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న ప్రజలకు సాయంగా ఉండేలా తన ట్విటర్ అకౌంట్ ను నిర్వహిస్తున్నారు.

తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు.. పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా సాయం కోరటం.. ఆ వెంటనే కేటీఆర్ స్పందించటం జరుగుతోంది. ఇలాంటివేళ.. కర్ణాటక కాంగ్రస్ పార్టీకి కొండంత అండగా నిలుస్తూ.. ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ తాజాగా ట్విటర్ వేదికగా తెలంగాణ రాష్ఠ్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. మంత్రి కేటీఆర్ కు ట్వీట్ వినతి చేశారు.

తమ రాష్ట్రానికి చెందిన మహిళకు సాయం చేయాలని కోరారు. తమ రాష్ట్రంలోని మాండ్యా ప్రాంతానికి చెందిన శశికళ మంజునాథ్ భర్త కరోనాతో బాధ పడుతూ చికిత్స కోసం హైదరాబాద్ లోని మెడికవర్ ఆసుపత్రిలో చేరారని.. చికిత్స పొందుతూ మరణించారన్నారు. చికిత్సకు రూ.7.5లక్షల బిల్లు వేశారని.. ఆ మహిళ రూ.2లక్షలు మాత్రమే చెల్లించుకుంటానని చెప్పినా ఆసుపత్రి వర్గాలు ఒప్పుకోవటం లేదన్నారు.

మొత్తం డబ్బు కడితేనే మృతదేహాన్ని ఇస్తామని ఆసుపత్రి స్పష్టం చేసిందని.. ఈ విషయాన్ని ఆమె బంధువులు తన దృష్టికి తెచ్చినట్లుగా పేర్కొన్నారు. వారిని ఆదుకోవాలని కోరారు. శివకుమార్ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ స్పందించారు. తక్షణమే మెడికవర్ ఆసుపత్రితో మాట్లాడాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఒక రాష్ట్రంలోని కీలక నేత సాయం కోసం ట్వీట్ రిక్వెస్టు పెట్టటం.. ఆ వెంటనే కేటీఆర్ స్పందించిన వైనాన్ని పలువురు అభినందిస్తున్నారు. మరి.. బాధిత మహిళ కోరుకున్నట్లుగా ఆసుపత్రి వర్గాలు మృతదేహాన్నిఇచ్చారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.