Begin typing your search above and press return to search.

తొలిసారి మాస్కు తీసిన కేటీఆర్

By:  Tupaki Desk   |   22 Nov 2020 10:15 AM IST
తొలిసారి మాస్కు తీసిన కేటీఆర్
X
వణికించే మహ్మమారికి వీలైనంత దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే రాజకీయ నేతలు కాస్త తక్కువే. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మినహాయింపుగా చెప్పక తప్పదు. కరోనా నేపథ్యంలో ఆయన ముఖానికి మాస్కులు పెట్టుకోవటానికి అమిత ప్రాధాన్యత ఇస్తారు. తన తండ్రి కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భిన్నంగా ఆయన వ్యవహరిస్తారు. అంతేకాదు..పార్టీ నేతలు ఎవరైనా ముఖానికి మాస్కు పెట్టుకోకుంటే.. వారిని సున్నితంగా హెచ్చరిస్తూ.. మాస్కు పెట్టుకోవాలని చెబుతారు.

అలాంటి కేటీఆర్ తాజాగా మాత్రం పెద్ద సాహసమే చేశారు. ప్రస్తుతానికి కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో తక్కువగా నమోదవుతున్నా.. ముప్పు మాత్రం పూర్తిగా తొలిగిపోలేదు. ఆ మాటకు వస్తే.. సెకండ్ వేవ్ ఎప్పుడు మొదలవుతుందో అర్థం కాక టెన్షన్ పడిపోతున్న పరిస్థితి. ఇలాంటివేళ.. వచ్చిన గ్రేటర్ ఎన్నికల వేళ కేటీఆర్ తన తీరుకు భిన్నంగా వ్యవహరించారు. పెద్ద ఎత్తున రోడ్ షోలకు ప్లాన్ చేసిన ఆయన.. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కుత్భుల్లాపూర్ నియోజకవర్గం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు.

ఈ సందర్భంగా తన ముఖానికి ఉన్న మాస్కును తొలగించి మాట్లాడారు. అయితే.. ప్రచార రథం మీద కేటీఆర్ కాకుండా మిగిలిన వారంతా మాత్రం ముఖానికి మాస్కులు పెట్టుకున్నారు. ఒకరిద్దరు మాత్రం మాస్కుల్ని పెట్టుకోలేదు. కరోనా వేళ.. భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాల్సినప్పటికి అవేమీ కేటీఆర్ రోడ్ షోలలో కనిపించలేదు. దీనికి తోడు.. పెద్ద ఎత్తున ప్రజలు షోలకు హాజరు కావటం చూస్తుంటే.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా కేటీఆర్ పెద్ద సాహసమే చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. కీలకమైన ఎన్నికల వేళ.. అనవసరమైన సాహసాలు అవసరమా కేటీఆర్?