Begin typing your search above and press return to search.

అలా కేటీఆర్ మాత్రమే చేయగలరేమో?

By:  Tupaki Desk   |   12 March 2016 5:45 AM GMT
అలా కేటీఆర్ మాత్రమే చేయగలరేమో?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారు. అరుదుగా దూకుడ్ని ప్రదర్శిస్తారు. టీఆర్ ఎస్ నేతల్లో ఎవరిలోని కనిపించని విలక్షణత కేటీఆర్ సొంతం. రెచ్చిపోయి మాట్లాడే తత్వమే కాదు.. ప్రశాంతంగానూ.. అందరి మనసుల్ని దోచుకునేలా మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఆయనకే ఉన్నాయి. తెలంగాణ ప్రాంతీయులకే కాక.. సీమాంధ్రుల మనసుల్ని దోచుకునేలా మాట్లాడే తెలివి కేటీఆర్ కే చెల్లుతుంది.

ఇటీవల ముగిసిన స్థానిక ఎన్నికల సందర్భంగా.. ఓటు వాళ్లకు వేసి.. మమ్మల్ని పని చేయమంటే ఎలా అంటూ నేరుగా అడిగిసేని కేటీఆర్.. అంతకు నెల ముందు జరిగిన గ్రేటర్ ఎన్నికల సమయంలో ఇదే మాటను ఎంత ముద్దుగా.. అందంగా చెప్పి హైదరాబాద్ లో స్థిరపడిన సీమాంధ్రుల మనసుల్ని దోచుకున్నాడో ఎన్నికల ఫలితాల్ని చూస్తేనే అర్థమవుతుంది.

అలాంటి కేటీఆర్.. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రదర్శించిన దూకుడు కాస్తంత అవాక్కు అయ్యేలా చేసింది. పార్టీల వారీగా అంశాల మీద తమ వాదనల్ని వినిపించటం మామూలే. అలా మాట్లాడుతున్న వారిని మిగిలిన పార్టీ నేతలు పట్టించుకోరు సరి కాదా.. వాళ్ల పని వారిది.. తమ పని తమదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అందుకు భిన్నంగా వ్యవహరించారు కేటీఆర్. ఇంటికో ఉద్యోగం ఇస్తుందని కేసీఆర్ చెప్పారంటూ మీడియాతో మాట్లాడుతున్న టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను చూసిన కేటీఆర్.. ఆయన చేయి లాగి మరీ.. ఆ మాటలు చెప్పింది చంద్రబాబు అని.. తాము చెప్పలేదని.. ప్రతి రోజూ నిరుద్యోగుల్ని ఉద్దేశించి ఇలాంటి మాటలు ఎందుకు చెబుతారంటూ వ్యాఖ్యానించటం విశేషం.

ఈ పని సీరియస్ గా చేసి ఉండకపోవచ్చు. కానీ.. ఒక విపక్ష ఎమ్మెల్యే తన వాదనను మీడియా ముందు చెబుతున్న వేళ.. చేయి లాగి మరీ చెప్పటం చూసినప్పుడు.. ఇలాంటివి కేటీఆర్ కు మాత్రమే సాధ్యమవుతాయని చెప్పాలి. అయితే.. కేటీఆర్ కు గుర్తు చేయాల్సిన అంశం ఒకటుంది. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ తన చేతుల్లోకి తీసుకున్న మొదట్లో.. తెలంగాణ రాష్ట్రం కానీ వస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుందని.. బతుకులన్నీ మారిపోతాయని చెప్పిందే.. చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటే మంచిది. ఒకవేళ మర్చిపోతే.. ఇంటి దగ్గర తన తండ్రితో మాట్లాడితే కేటీఆర్ కు మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.