Begin typing your search above and press return to search.

కేటీఆర్ అతిశ‌యం హ‌ద్దులు దాటోతోందిగా..?

By:  Tupaki Desk   |   31 July 2018 1:13 PM IST
కేటీఆర్ అతిశ‌యం హ‌ద్దులు దాటోతోందిగా..?
X
గ‌డిచిన రెండు రోజులుగా కేసీఆర్ స‌ర్కారుకు ఊహించ‌ని రీతిలో శాప‌నార్థాలు ఎదురు కావ‌టం తెలిసిందే. ల‌ష్క‌ర్ బోనాల సంద‌ర్భంగా జోగిని.. స్వ‌ర్ణ‌త భ‌విష్య వాణిలో ప్ర‌భుత్వానికి ఇబ్బంది క‌లిగించే రీతిలో వ్యాఖ్య‌లు రావ‌టం చ‌ర్చ‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ విమ‌ర్శ‌లపై ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతున్న వేళ‌లోనే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల‌న గురించి ఆయ‌న కుమారుడు క‌మ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారాయి.

ఈ మ‌ధ్య‌న కేసీఆర్ ను మ‌హాత్మాగాంధీ.. మండేలా.. లాంటి ప్ర‌ముఖుల‌తో పోల్చేసిన వైనం తెలిసిందే. మామూలుగానే గులాబీ నేత‌ల‌కు నోరు ఎక్కువ‌.. మాట‌లు ఎక్కువ‌ని స‌ర్దుకుపోతుంటే.. తాజాగా మంత్రి కేటీఆర్ నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు వింటే అవాక్కు కావ‌ట‌మే కాదు.. చిన్న అయ్య‌గారి అతిశ‌యం హ‌ద్దులు దాటేలా మారుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి రాజ‌కీయాల‌కు అతీతంగా సాగుతోంద‌న్న కేటీఆర్‌.. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా పాల‌న సాగుతుంద‌ని పొగిడేశారు. అక్క‌డితో ఆగినా.. స‌ర్లే.. తండ్రి పాల‌న‌ను కొడుకు ఆ మాత్రం పొగ‌డ‌టం మామూలేగా అని స‌ర్ది చెప్పుకోవ‌చ్చు. కానీ.. ఈ మ‌ధ్య‌న పెరిగిన ఆత్మ‌విశ్వాసం అంత‌కంత‌కూ పెరిగి హ‌ద్దులు దాటే అతిశ‌యంతో ట‌చ్ చేయ‌కూడ‌ని అంశాల్ని అల‌వోక‌గా ట‌చ్ చేశారు కేటీఆర్‌.

శ్రీ‌రాముడి పాల‌న‌లో సైతం భూమికి శిస్తు క‌ట్టించుకునేవార‌ని.. కానీ కేసీఆర్ పాల‌న‌లో మాత్రం రైతుకే డ‌బ్బులు ఇస్తున్నామ‌ని.. గొప్ప‌లు చెప్పుకున్నారు. రైతుల‌కు రూ.17వేల కోట్ల రుణాల్ని మాఫీ చేశామ‌ని.. వారికి ధీమా క‌ల్పించేందుకు ఆగ‌స్టు 15 నుంచి రూ.5ల‌క్ష‌ల బీమా అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. 2019లో కేసీఆర్ ఒంట‌రిగా వ‌చ్చి.. ఒక్క‌రికి కూడా డిపాజిట్లు మిగ‌ల‌కుండా బుద్ధి చెబుతార‌న్నారు. పార్ల‌మెంటులో కేసీఆర్ ను ప్ర‌ధాని మోడీ పొగిడేశార‌ని గుర్తు చేశారు.

కేసీఆర్ మెచ్యూరిటీతో ముందుకు వెళుతున్నార‌ని ప్ర‌శంసించార‌ని.. ప‌క్క రాష్ట్రం మాత్రం ఏడుస్తూ ఉండిపోయింద‌ని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి దేశ ప్ర‌ధానికి అర్థ‌మ‌వుతున్నా.. ఇక్క‌డి కాంగ్రెస్ నేత‌ల‌కు మాత్రం సోయి రావ‌టం లేద‌న్నారు. ఇన్ని చెప్పే కేటీఆర్‌.. మోడీతో త‌మ‌కున్న ర‌హ‌స్య స్నేహాన్ని చెప్పే ధైర్యం ఎందుకు చేయ‌రు? కేసీఆర్ మెచ్చూరిటీని ప్ర‌ధాని మోడీ ఎందుకు పొగిడారో.. రాజ‌కీయాలు తెలిసిన ప్ర‌తి ఒక్క‌రికి తెలిసినా.. కేటీఆర్ కు మాత్రం మ‌రోలా అర్థం కావ‌టం ఏమిటో..?