Begin typing your search above and press return to search.

అయినా దేవుడికి మ‌రో ప‌ని లేదా కేటీఆర్‌?

By:  Tupaki Desk   |   29 Sept 2018 11:00 PM IST
అయినా దేవుడికి మ‌రో ప‌ని లేదా కేటీఆర్‌?
X
ఆత్మ‌విశ్వాసం ఎక్కువ‌గా ఉండ‌టం మంచిది. కానీ.. ఆ తొంద‌ర‌లో ల‌క్ష్మ‌ణ రేఖ‌ల్ని దాటేయ‌టం ఏ మాత్రం మంచిది కాదు. త‌న స‌త్తాను ప్ర‌ద‌ర్శించుకోవ‌టానికి అదే ప‌నిగా మాట్లాడుతున్న కేటీఆర్ మాట‌ల్లో ఈ మ‌ధ్య‌న గొప్ప‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. విప‌క్షాల‌పై విరుచుకుప‌డ‌టం త‌ప్పేం కాదు కానీ.. మ‌ధ్య‌లో సంబంధం లేని వారిని తీసుకొచ్చి.. వారిని చిన్న‌బుచ్చేలా మాట్లాడ‌టంలోనే అస‌లు స‌మ‌స్య‌.

త‌న దారిన తానున్న దేవుడ్నిత‌న మాట‌ల మ‌ధ్య‌లోకి తీసుకొచ్చి.. ఆయ‌న్ను చిన్న‌బుచ్చేలా మాట్లాడ‌టంలో ఏమైనా అర్థం ఉంటుందా? అంత‌కంత‌కూ పెరుగుతున్న ఆత్మ‌విశ్వాసంతో నోటికి వ‌చ్చిన‌ట్లుగా వ్యాఖ్య‌లు చేస్తున్న కేటీఆర్‌.. తాజాగా త‌న మాట‌ల్లోకి దేవుడ్ని తెచ్చేశారు. తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు భిన్నంగా దేవుడు వ్య‌వ‌హ‌రిస్తే.. ఆయ‌న్ను సైతం ఎదిరించ‌టానికి కేసీఆర్ సిద్ధ‌మ‌ని చెప్ప‌టం ద్వారా పెద్ద మాట‌నే వాడేశారు. అయినా.. తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు భిన్నంగా దేవుడు ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తారు?

అయినా.. దేవుడు లెక్క‌లో చూస్తే కేసీఆర్ ఎంత‌?.. త‌న తండ్రిని.. పార్టీ అధినేత‌ను గొప్ప‌గా చిత్రీక‌రించ‌టం త‌ప్పేం కాదు.. కానీ.. అందులోకి దేవుడ్ని తీసుకొచ్చి.. ఆయ‌న కంటే త‌న తండ్రే మొన‌గాడ‌న్న‌ట్లుగా ఇచ్చే బిల్డ‌ప్ తో లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌న్న‌ది కేటీఆర్ మ‌ర్చిపోతున్న‌ట్లున్నారు. క‌నిపించ‌ని దేవుడ్ని ఎన్ని మాట‌లు అన్నా ఫ‌ర్లేదు. కానీ.. తెలీని శ‌క్తి ఒక‌టి చుట్టూ ఉంటుంద‌ని.. దానికి చిరాకు తెప్పించే మాట‌లు.. చేత‌లు.. ఏ మాత్రం మంచివి కావ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. మ‌రి.. ఈ విష‌యాల‌న్నితెలిసి అంటున్నారో.. తెలియ‌క అంటున్నారో కానీ.. దేవుడ్ని చిన్న‌బుచ్చే మాట‌ల్ని కేటీఆర్ ప్రస్తావించ‌కుంటే బాగుండు.

ఈమ‌ధ్య‌న ఒక ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా ఏమీ తెలీని చిన్న‌పిల్లాడైన త‌న కొడుకును ఉద్దేశించి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు అన్న మాట‌లు విన్న‌ప్పుడు బాధేసింద‌ని చెప్పుకొన్న కేటీఆర్‌.. ఈ రోజున త‌న తండ్రి గొప్ప‌త‌నం కోసం దేవుడ్ని చిన్న‌బుచ్చేలా మాట్లాడటం స‌బ‌బా? అన్న‌ది క్వ‌శ్చ‌న్ మ‌రి.. దీనికి కేటీఆర్ ఏమంటారో?