Begin typing your search above and press return to search.

కేటీఆర్ ప‌ట్టాభిషేకానికి రంగం సిద్ధం.. కేసీఆర్ కొత్త స్కెచ్‌

By:  Tupaki Desk   |   11 Feb 2022 6:00 AM IST
కేటీఆర్ ప‌ట్టాభిషేకానికి రంగం సిద్ధం.. కేసీఆర్ కొత్త స్కెచ్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న త‌న‌యుడు , రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను సీఎం చేసేందుకు ఎత్తుగ‌డ సిద్ధం చేశారా? జాతీయ రాజకీయాల‌పై ఫోక‌స్ పెట్టిన గులాబీ ద‌ళ‌ప‌తి ఈ మేర‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కేటీఆర్ ను నియ‌మించేందుకు ప్ర‌స్తుతం అందివ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటున్నారా అనే చ‌ర్చ ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాల్లో జోరుగా సాగుతోంది. దీనికి కార‌ణం ప్ర‌స్తుత ప‌రిణామాలు , సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ‌.

తెలంగాణలో రాజ‌కీయాలు హాట్ హాట్‌గా మారిన‌ప్ప‌టికీ ఎప్ప‌ట్లాగే తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్ర‌ధాని మోడీ పార్ల‌మెంటు చేసిన వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ చోటా నేత‌లు మొద‌లుకొని ఢిల్లీలో ఉండే ఎంపీల వ‌ర‌కు నిర‌స‌న‌లు , ఆందోళ‌న‌లు చేస్తుంటే కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. పైగా ఈ కార్య‌క్ర‌మాల‌న్నీ టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, సీఎం క‌సీఆర్ త‌న‌యుడు కేటీఆర్ సార‌థ్యంలో జ‌రుగుతున్నాయి. ఇలా కేసీఆర్ మౌనం, కేటీఆర్ దూకుడు స‌హ‌జంగానే తండ్రి జాతీయ రాజ‌కీయాలు, త‌న‌యుడు స్థానిక రాజ‌కీయాలు అనే చ‌ర్చ‌కు కార‌ణం అయ్యాయి.

మ‌రోవైపు ఇటీవ‌ల తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని మోడీకి సీఎం హోదాలో కేసీఆర్ స్వాగ‌తం - వీడ్కోలు చెప్ప‌క‌పోవ‌డంపై బీజేపీ శ్రేణులు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు కేసీఆర్ ఏ మాత్రం స్పందించ‌డం లేదు. పైగా దీనిపై నిర‌స‌న కార్య‌క్ర‌మాలు, సోష‌ల్ మీడియాలో గులాబీ దళం స్పంద‌న‌లు అంతా కేటీఆర్ నాయ‌క‌త్వంలోనే జ‌రిగింది. దీని వెనుక మ‌త‌లబు ఏమై ఉంటుంద‌నే అనుమానాన్ని స‌హ‌జంగానే రాజ‌కీయ శ్రేణులు తెర‌మీద‌కు తెస్తున్నాయి.

కేంద్ర ప్ర‌భుత్వం దేశ‌మంత‌టికి వ‌ర్తించే బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా దాదాపు రెండు గంట‌ల పాటు విలేకరుల స‌మావేశంలో త‌న వైఖ‌రిని వెల్ల‌డించి, ఏకంగా రాజ్యాంగాన్ని మార్చే డిమాండ్ చేసిన కేసీఆర్‌.... ఇప్పుడు ఓ వైపు త‌న వైఖ‌రిపై విమ‌ర్శలు వ‌స్తున్న స‌మ‌యం మ‌రోవైపు త‌న ఇలాకా అయిన తెలంగాణ ఏర్పాటు గురించి ప్ర‌ధాని చేసిన వ్యాఖ్య‌ల‌పై కామెంట్లు చేయ‌కుండా మౌనంగా ఉండ‌టం, ఇదే స‌మ‌యంలో పార్టీ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను త‌న త‌న‌యుడు కేటీఆర్ ద్వారా చేయించ‌డం చూస్తుంటే... కేటీఆర్ ప‌ట్టాభిషేకానికి రంగం సిద్ధ‌మైందా? అన్న చ‌ర్చ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోంది.