Begin typing your search above and press return to search.

బాబు గుట్టు ర‌ట్టు చేసిన కేటీఆర్‌!

By:  Tupaki Desk   |   29 Nov 2018 10:32 PM IST
బాబు గుట్టు ర‌ట్టు చేసిన కేటీఆర్‌!
X
తెలంగాణ రాష్ట్రంలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో అంద‌రి చూపు ప‌డిన నియోజ‌క‌ వ‌ర్గాల్లో అతికొద్ది వాటిల్లో కూక‌ట్‌ ప‌ల్లి ఒక‌టి. దివంగ‌త నంద‌మూరి హ‌రికృష్ణ త‌న‌య సుహాసిని బ‌రిలో దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ పోటీ వెనుక ఆంత‌ర్యం గురించి ప‌లువురు ప‌లు ర‌కాలుగా విశ్లేషించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మంత్రి కేటీఆర్ ఈ ఎపిసోడ్‌ ను ఇంకో విభిన్న కోణంలో ప్ర‌స్తావించారు. చంద్రబాబు తన నయవంచక రాజకీయాలకు మరోసారి నందమూరి కుటుంబాన్నిబలిపశువును చేయాలని చూస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. కూకట్‌ప‌ల్లి రోడ్ షోలో టీఆర్ ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు తరుపున రోడ్ షోలో ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సంద‌ర్భంగా కొత్త సూత్రీక‌ర‌ణ చేశారు.

టీడీపీ అధ్య‌క్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నంద‌మూరి కుటుంబంపై ప్రేమ లేద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ``చంద్ర‌బాబుకు నిజంగానే నందమూరి కుటుంబం మీద అంత ప్రేమ ఉంటే - పిల్లనిచ్చిన మామా ఎన్టీఆర్ గారి మీద అభిమానం ఉంటే నందమూరి సుహాసినిని ఎమ్మెల్సీ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నేరుగా నారా లోకేష్ మాదిరిగా నేరుగా మంత్రిని చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు? ఎందుకంటే - ఓడిపోతుంది అని తెలిసి కూడా కూకట్‌ ప‌ల్లిలో పోటీ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నిజంగా తెలంగాణాలో టీడీపీ పార్టీ పాగా వేయాలని బలంగా వాళ్ళు కోరుకుంటే నేరుగా ఇదే స్థానం నుండి లోకేష్‌ ను ఎందుకు పోటీకి నిలబెట్టలేదు సూటిగా అడిగారు. చంద్రబాబుకు ఇది ఓడిపోయే సీటు అని తెలుసు కాబట్టే ఇక్కడ నుంచి లోకేష్‌ ని నిలబెట్టడానికి సాహసం చేయలేదు అని కూకట్‌ ప‌ల్లిలో నందమూరి సుహాసినిని నిలబెట్టి పాపం ఆ అమ్మాయిని బలిపశువును చేస్తున్నాడు చంద్రబాబు`` అని విమర్శించారు.

నందమూరి కుటుంబాన్ని మొత్తం ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న దురాలోచన చంద్రబాబు నాయుడుది అని కేటీఆర్ ఆరోపించారు. నందమూరి కుటుంబాన్ని రాజకీయంగా ఏపీలో తనకు అడ్డురాకుండా చూడటానికి - సుహాసిని సోదరులను సైతం పక్కకు పెట్టే కుయుక్తి చంద్రబాబు పన్నుతున్నారని విమర్శించారు. ఈ విషయం నందమూరి కుటుంబం గ్రహించాలి అని నందమూరి కుటుంబానికి హితవు పలికారు. కేసీఆర్ నన్ను ఎందుకు విమర్శిస్తున్నాడో తెలియడం లేదని అమాయకంగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు అని - నిజంగా ఆయనకు తెలియదా అని కేటీఆర్ చంద్రబాబును ప్రశ్నించారు. ``చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి కుట్రపన్నడం వాస్తవం కాదా ? మనవాళ్ళు బీఫ్రీడ్ మీ అంటూ అడ్డంగా దొరికిపోలేదా ? తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి ఉత్తరాలు రాసింది నిజం కాదా ?అలాంటప్పుడు మేము చంద్రబాబును విమర్శించకూడదా?`` అని కేటీఆర్ తన ప్రసంగంలో చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు. చంద్రబాబును విమర్శిస్తే సీమాంధ్ర ప్రజలను విమర్శించినట్లే అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు అని కేటీఆర్ తెలిపారు ఇందులో సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి సంబంధం లేదని కేవలం తన ఉనికి కాపాడుకోవడానికే సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే కుట్ర చేస్తున్నారని విమర్శించాడు. గడిచిన నాలుగేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ప్రాంతాల ప్రజలను తెలంగాణ బిడ్డలుగానే పరిగణించింది అని, చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని విజ్ఞప్తి చేశారు.