Begin typing your search above and press return to search.

భ‌యం లేద‌న‌డంలోనే భ‌యం క‌నిపిస్తోంద‌ట కేటీఆర్‌!

By:  Tupaki Desk   |   18 Nov 2017 11:30 PM GMT
భ‌యం లేద‌న‌డంలోనే భ‌యం క‌నిపిస్తోంద‌ట కేటీఆర్‌!
X
ఔను. తెలంగాణ రాష్ట్ర స‌మితి పెద్ద‌లు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌తో ఇప్పుడు ఆ పార్టీ నేత‌ల్లోనే భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ట‌. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా..రాజ‌కీయ ప్ర‌సంగాలు చేస్తున్నప్పుడ‌ల్లా..రాష్ట్రంలో ప్ర‌జ‌లు టీఆర్ ఎస్‌ కే 2019 ఎన్నిక‌ల్లో ప‌ట్టం క‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ప్ర‌క‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిప‌క్షాలు డిపాజిట్ల కోసం వెతుక్కోవాల‌ని కూడా తెలంగాణ సీఎం - టీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌ తో పాటుగా ఆ పార్టీ ముఖ్య‌నేత‌లు అయిన కేటీఆర్‌ - హ‌రీశ్‌ రావు - క‌విత సైతం ఇదే జపం చేస్తుంటారు. అయితే ఇంత తేలిక‌గా తీసేసిన విప‌క్షం గురించే ప‌దే ప‌దే ఈ నేత‌లు ప్ర‌స్తావించ‌డం ఆస‌క్తికరంగా మారింది.

డిపాజిట్ల కోసం ఎదురుచూడ‌టం అంటే...దాదాపుగా ఆ పార్టీలు తుడిచిపెట్టుకుపోయిన‌ట్లే. కానీ అందుకు భిన్నంగా మ‌రోమారు ఆ పార్టీల‌ను బొంద‌పెట్టండి అంటూ ప్ర‌క‌ట‌న చేయ‌డం ఏంటో అర్థం కావ‌డం లేద‌ని అంటున్నారు. తాజాగా టీఆర్ ఎస్ యువ‌నేత‌గా అంచ‌నాలు వెలువ‌డుతున్న మంత్రి కేటీఆర్ ఈ పిలుపు ఇచ్చారు. వరంగల్ నగరంలో ఇవాళ పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ఒక్కరోజే రూ. 100 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం హ‌న్మ‌కొండ‌ కాకతీయ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం చేయాల‌నుకుంటోన్న అభివృద్ధి ప‌నుల‌న్నింటికీ కాంగ్రెస్ పార్టీ అడ్డుప‌డుతోంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విద్యుతు ఇచ్చే ప్ర‌యత్నం చేద్దామ‌న్నా - ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇద్దామన్నా - ప్రాజెక్టులు క‌డదామ‌న్నా కాంగ్రెస్ నేత‌లు అడ్డుప‌డుతున్నార‌ని అన్నారు.

కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణకు ద‌రిద్రంలా ప‌ట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నేత‌లు - ఇప్ప‌టికీ అడ్డుప‌డుతున్నార‌ని కేటీఆర్ అన్నారు. త‌మకు బాస్‌ లు ఢిల్లీలో ఉండేవారు కాదని, గ‌ల్లీల్లో ఉండే ప్ర‌జ‌లే త‌మ‌కు బాస్‌ లు అని కేటీఆర్ అన్నారు. ఏ స‌ర్వే చేసినా కేసీఆర్ నెంబ‌ర్ 1 ముఖ్య‌మంత్రి అని తేలుతోంద‌ని పేర్కొన్నారు . రోడ్డుపై ఏనుగు పోతోంటే కుక్క‌లు మొరుగుతుంటాయని వాటిని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని చెప్పారు. కాంగ్రెస్ నాయ‌కులు చేస్తోన్నటువంటి ధ‌ర్నాలు, ఆందోళ‌న‌లను చాలా చూశామ‌ని అన్నారు. తెలంగాణ ఉద్య‌మంలో తాను జైలుకి కూడా వెళ్లానని తెలిపారు. ఆ రోజు తాము ప్ర‌జ‌ల మ‌ద్దతుతో ఉద్య‌మాలు చేశామ‌ని చెప్పారు. ప‌స‌లేని, ప‌నిలేని ద‌ద్ద‌మ్మ‌ల‌కు తాము జ‌వాబుదారులం కాదని వ్యాఖ్యానించారు.