Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ విష‌యంలో కేటీఆర్ ఫీలింగ్ ఇదే

By:  Tupaki Desk   |   13 Dec 2018 11:10 PM IST
జ‌గ‌న్ విష‌యంలో కేటీఆర్ ఫీలింగ్ ఇదే
X
టీఆర్ ఎస్ పార్టీ యువ‌నేత‌ - మాజీ మంత్రి కే తారకరామారావు ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌ను పంచుకున్నారు. ఇటీవ‌ల ఏపీ రాజ‌కీయాల్లో కూడా వేలు పెడ‌తామ‌ని ప్ర‌క‌టించిన కేటీఆర్ దీనికి కొన‌సాగింపుగా...ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమైనా - ఆయా పార్టీల అగ్రనేతలు ప్రచారం చేసినా టీఆర్ ఎస్ ఘనవిజయం సాధించిందని గుర్తుచేశారు. ఇంతటి గొప్ప గెలుపు అందించినందుకు ఆయన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికలతో పోల్చితే రాష్ట్రంలో టీఆర్ ఎస్‌ కు 13శాతం ఓట్లు పెరిగాయని చెప్పారు. కేంద్రంలో నాన్ బీజేపీ - నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నదే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. ఈ ప్రయత్నంలో వెన్నంటి ఉండేందుకు చాలా రాష్ట్రాలకు చెందిన స్థానిక పార్టీల నాయకులు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. దేశంలోని సాధారణ ప్రజలు ఆరోగ్యం - విద్య - విద్యుత్ - మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాల్లో అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను కేటీఆర్ తిప్పికొట్టారు. వారికి మధ్యప్రదేశ్ - ఛత్తీస్‌ గఢ్ - రాజస్థాన్‌ లోని ఈవీఎంలపై ఎందుకు అనుమానం రావడం లేదని ప్రశ్నించారు. కామన్‌ సెన్స్‌ తో ఆలోచించాలని ప్రతిపక్షాలకు సూచించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్ ఎస్ ఘనవిజయం సాధించబోతున్నదని, రాష్ట్రంలోని 16 పార్లమెంట్ స్థానాలను గెలిచి ఢిల్లీ రాజకీయాల్లో కీలకప్రాత పోషిస్తామని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. తెలంగాణ భవన్‌ లో జాతీయ మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం స్పష్టమైన ఖాళీ కనిపిస్తున్నదన్నారు. తెలంగాణలో నాన్ కాంగ్రెస్ - నాన్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడినట్టే కేంద్రంలోనూ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీడీపీ ఉనికి గల్లంతవుతుందని స్పష్టంచేశారు.

ఇక ఏపీ రాజ‌కీయాల గురించి కేటీఆర్ స్పందిస్తూ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి టీఆర్ ఎస్ పార్టీ మద్దతు తెలుపడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేటీఆర్ తెలిపారు. తమకు రాజకీయంగా అనేక పార్టీలతో మితృత్వం ఉన్నదని, ఇప్పటివరకు ప్రత్యేకంగా ఏ ఒక్క పార్టీకీ పరిమితం కాలేదని చెప్పారు. ఏపీలో వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారని - వారికి మంచి జరుగాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పూర్తిగా తెలంగాణలో పాలనపై దృష్టి కేంద్రీకరిస్తామని - ఆ తర్వాత అంశాలవారీగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. గ‌గన్ తరఫున మీరు ప్రచారం చేస్తారా అని మీడియా కేటీఆర్‍‌ ను ప్రశ్నించగా... ముందు ఇక్కడ (తెలంగాణ) సర్దుకోనివ్వండని - ఒకేసారి అన్ని విషయాలు చెప్పమంటే ఎలా అంటూ త‌న‌దైన శైలిలో చ‌మ‌త్క‌రించారు.