Begin typing your search above and press return to search.

అర్థరాత్రి వేళ పరుగులు పెట్టించిన కేటీఆర్

By:  Tupaki Desk   |   13 July 2016 10:57 AM IST
అర్థరాత్రి వేళ పరుగులు పెట్టించిన కేటీఆర్
X
హైదరాబాద్ మహా నగర మంచి చెడులు చూసుకోవాలంటూ తన తండ్రి కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించిన బాధ్యతను నిర్వర్తించే క్రమంలో మంత్రి కేటీఆర్ కొత్త పుంతలు తొక్కారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ నగర రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ మీడియాలో వచ్చిన వార్తలకు స్పందించిన ఆయన.. ఆకస్మిక తనికీలంటూ హడావుడి చేయటం తెలిసిందే. రోడ్ల పరిస్థితుల మీద.. పారిశుదధ్యం మీదా.. రోడ్ల మీద అడ్డదిడ్డంగా గోతులు తవ్వటం మీద సీరియస్ అయిన కేటీఆర్ పరిస్థితులు మారాలన్నారు. కానీ.. మార్పు వచ్చింది లేదనే చెప్పాలి.

ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి మంత్రి కేటీఆర్ కాస్తంత హడావుడి చేశారు. చల్లటి వాతావరణంలో వెచ్చ వెచ్చగా నిద్రపోదామని డిసైడ్ అయిన అధికారులకు షాకులిస్తూ.. ఆకస్మిక తనిఖీలు షురూ చేశారు. మంత్రివర్యులు తనిఖీలు చేసేందుకు రోడ్ల మీదకు వచ్చారన్న విషయం తెలిసిన వెంటనే.. అధికారులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. రాత్రి 11 గంటలకు మొదలైన ఆయన ఆకస్మిక తనిఖీల పర్వం అర్థరాత్రి 2.30 గంటల వరకూ నిర్విరామంగా సాగింది.

కేపీహెచ్ బీ తో మొదలై.. కూకట్ పల్లి.. ఎస్ ఆర్ నగర్.. అమీర్ పేట.. పంజాగుట్ట వరకూ సాగింది. పలు ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్న ఆయన.. అదే సమయంలో బస్టాండ్లలో ఉన్న పరిస్థితుల మీద అధికారులపై మండిపడ్డారు. బస్టాండ్ల ముందు వర్షపునీరు నిలిచిపోవటంపై చిరాకు పడ్డ ఆయన.. రోడ్ల పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లో పనులు పూర్తి అవ్వాలంటూ డెడ్ లైన్ పెట్టిన ఆయన.. మరికొన్ని రోజుల పాటు రాత్రిళ్లు ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పేశారు. చిన్నారి రమ్య మరణానికి కారణమైన ప్రమాద స్థలిని పరిశీలించిన ఆయన.. అక్కడ రోడ్డు ఇరుగ్గా ఉండటాన్ని గుర్తించారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వీలుగా అక్కడి పరిస్థితులను మార్చాలని చెప్పారు. ఇకపై తరచూ ఆకస్మిక తనిఖీలు ఉంటాయని చెప్పటం చూస్తే.. జీహెచ్ ఎంసీ అధికారులకు ఇక నిద్రలేని రాత్రిళ్లు షురూ అయినట్లే.