Begin typing your search above and press return to search.

కొడుకేమో అభిమాని.. తండ్రికేమో తెలీదంట

By:  Tupaki Desk   |   27 Jun 2015 12:51 PM IST
కొడుకేమో అభిమాని.. తండ్రికేమో తెలీదంట
X
వ్యక్తిగత అభిరుచుల్ని తప్పు పట్టటం ఇక్కడ ఉద్దేశ్యం ఎంత మాత్రం కాదు. కాకపోతే... రాజకీయాల్లో భిన్న ధ్రువాలు.. వ్యక్తిగత వైరుధ్యాలతో పాటు.. ప్రముఖులైన వ్యక్తుల మధ్య నెలకొన్న కొన్ని విచిత్రమైన అంశాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ పెట్టి.. కేసీఆర్‌ మీద.. ఆయన కుమార్తె మీద విమర్శలు చేసిన సమయంలో టీఆర్‌ఎస్‌ అధినేతగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ స్పందిస్తూ.. ఆడెవడో పవన్‌ కల్యాణ్‌ అంట.. ఆడి ముకం కూడా చూసింది లేదంటూ పరుషంగా మాట్లాడారు.

కేసీఆర్‌ తీరే అంత అని అనుకున్నారు.. ఆడెవడో తెలీని పవన్‌ కల్యాణ్‌ మీద.. తర్వాతి కాలంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేయాల్సి రావటం వేరే విషయం. ఇదిలా ఉంటే.. కేసీఆర్‌ కుమారుడు.. తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ వ్యవహారమే తీసుకుంటే.. తాజాగా ఆయన సామాజిక వెబ్‌సైట్‌లో పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మీ అభిమాన నటులు ఎవరన్న మాటకు.. తనకు పవన్‌ కల్యాణ్‌ అంటే ఇష్టమని.. ఆయన సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చారు. దర్శకులుగా రాజమౌళి ఇష్టమని.. బాహుబలి సినిమా చూడాలని తాను అనుకున్నట్లుగా వెల్లడించారు.

రాజకీయంగా వేరున్నా.. సినిమా నటుడిగా మాత్రం పవన్‌కల్యాణ్‌ ఇష్టమని కేటీఆర్‌ చెప్పటం ఆశ్చర్యకరమే. ఇక్కడ కేటీఆర్‌ను అభినందించాల్సిన అవసరం ఉంది. తాను అభిమానించే వ్యక్తి విషయంలో అబద్ధం చెప్పినా ఎవరూ ఏమీ ప్రశ్నించరు. కానీ.. రాజకీయ వైరుధ్యాల సంగతి ఎలా ఉన్నా.. వ్యక్తిగతంగా మాత్రం తాను పవన్‌కల్యాణ్‌ను అభిమానిస్తానని చెప్పటం గొప్ప విషయమే.

ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కొడుకు విపరీతంగా అభిమానించే నటుడు గురించి తండ్రి అయిన కేసీఆర్‌కు తెలీకి పోవటం. పిల్లలుఎవరిని అభిమానిస్తారన్న విషయం మొదట గుర్తించే తల్లిదండ్రులే. మరి.. అలాంటిది కేటీఆర్‌ ఇష్టాల గురించి కేసీఆర్‌కు తెలీదనుకోవాలా? లేక.. రాజకీయాల్లో తెలిసిన వారు కూడా తెలీని వారిగా మారిపోతారా?