Begin typing your search above and press return to search.

గూగుల్‌ లో ఇక సైబ‌ర్ ట‌వ‌ర్స్ క‌నిపించ‌దు

By:  Tupaki Desk   |   7 Nov 2017 11:07 AM IST
గూగుల్‌ లో ఇక సైబ‌ర్ ట‌వ‌ర్స్ క‌నిపించ‌దు
X
తెలుగుదేశం పార్టీ అధినేత‌ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప‌దే ప‌దే చేసుకునే ప్ర‌చారానికి దెబ్బేసేలా...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - రాష్ర్ట ఐటీ మంత్రి స్కెచ్ వేశారా? పేరు ఎత్తితే సైబ‌ర్ ట‌వ‌ర్స్‌.... ప్ర‌స్తావిస్తే హైద‌రాబాద్‌ ను ఐటీకి కేరాఫ్ అడ్ర‌స్ చేశాన‌ని బాబు చేసుకునే ప్ర‌చారానికి చెక్‌ పెట్టేసేలా కేటీఆర్ కొత్త నిర్మాణానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారా? అంటే అవుననే స‌మాధానం వ‌స్తోంది తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ వేసిన ముంద‌డుగుతో.

హైద‌రాబాద్ అంటే చ‌రిత్ర‌కు సంబంధించి చార్మినార్‌, ఐటీ అంటే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది సైబ‌ర్ ట‌వ‌ర్స్‌ - నోరూరించే రుచి అంటే గుర్తుకు వ‌చ్చేది బిర్యాని...అయితే ఇక సైబ‌ర్ టవ‌ర్స్ నామ్‌కే వాస్తీ కానుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే...తెలంగాణలో యానిమేషన్ - గేమింగ్ - వీఎఫ్‌ ఎక్స్ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ విశేష వృద్ధిని కాంక్షిస్తూ మంత్రి కేటీఆర్ ఇమేజ్ టవర్‌ కు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.945 కోట్ల అంచనా వ్యయంతో 2020 నాటికి 16లక్షల చదరపు అడుగుల్లో ఇమేజ్ టవర్‌ ను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ టవర్ టీ ఆకారంలో నిర్మాణమవుతోంది. టీ ఫర్ తెలంగాణ - టీ ఫర్ టెక్నాలజీ అని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఈ నిర్మాణంతో ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న రంగంగా యానిమేషన్ - వీఎఫ్‌ ఎక్స్ - గేమింగ్ పరిశ్రమకు హైదరాబాద్ చిరునామా కానున్నదని వివరించారు.

అయితే ఇవ‌న్నీ బాగానే ఉన్న‌ప్ప‌టికీ...ఇప్ప‌టివ‌ర‌కు హైద‌రాబాద్‌ లో ఐటీ అంటే సైబ‌ర్ ట‌వ‌ర్స్‌ గానే ముద్ర‌ప‌డింది. చంద్ర‌బాబు సైతం ఇదే ప్ర‌చారం చేసుకుంటున్నారు. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఐటీ - ఐటీ అనుబంధ ప‌రిశ్ర‌మ వృద్ధికి మంత్రి కేటీఆర్ కృషిచేస్తున్న‌ప్ప‌టికీ...త‌మ స‌ర్కారుకు సంబంధించిన ముద్ర భ‌వ‌నం రూపంలో లేద‌నే భావ‌న టీఆర్ ఎస్ వ‌ర్గాల్లో క‌లిగింద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇమేజ్ కోసం...ఈ ఇమేజ్ టవ‌ర్స్‌ ను నిర్మించార‌ని అంటున్నారు. ఈ ట‌వ‌ర్ నిర్మాణం త‌ర్వాత‌...సైబ‌ర్ ట‌వ‌ర్స్ అనేది జ్ఞాపకంగా మిగిలిపోతుంద‌ని...ఇమేజ్ ట‌వ‌ర్సే తెర‌మీద‌కు వ‌స్తుంద‌ని చెప్తున్నారు.

ఇదే అంశాన్ని మంత్రి కేటీఆర్ పరోక్షంగా కూడా ప్ర‌స్తావించారు. 430 ఏళ్ల‌ క్రితం హైదరాబాద్ నగరానికి ఖులీ కుతుబ్‌ షా చార్మినార్‌ ను నిర్మిస్తే.. ఈ తరానికి ఇమేజ్ టవర్ ఐకాన్‌ గా నిలిచిపోతుందని అన్నారు. ట్విట్టర్‌ లో ఇమేజ్ టవర్ నమునాలకు బ్రహ్మండమైన స్పందన లభించిందని, ఇప్పుడు యావత్‌ దేశం హైదరాబాద్ వైపే చూస్తున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.హైదరాబాద్‌ లో వీఎఫ్‌ ఎక్స్ - టుడీ - త్రీడీ యానిమేషన్ - గేమింగ్ రంగంలో దాదాపు వంద కంపెనీలు 30వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నుంచి అమెరికాకు దాదాపు 300 మిలియన్ డాలర్ల విలువైన కంటెంట్‌ ను అభివృద్ధిచేసి పంపిస్తున్నామని చెప్పారు. సినిమారంగంలో విశేష ఆదరణ పొందిన బాహుబలి - అరుంధతి - లైఫ్ ఆఫ్ పై - మగధీర - ఈగ లాంటి సినిమాలకు యానిమేషన్‌ ను హైదరాబాద్ కంపెనీలు తయారుచేసి ఇక్కడి సత్తాను చాటాయని తెలిపారు.