Begin typing your search above and press return to search.

శ‌భాష్ కేటీఆర్‌.. మాటిచ్చారు.. పాప ప్రాణం నిల‌బెట్టారు!

By:  Tupaki Desk   |   26 Jun 2021 8:30 AM GMT
శ‌భాష్ కేటీఆర్‌.. మాటిచ్చారు.. పాప ప్రాణం నిల‌బెట్టారు!
X
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, సీఎం త‌న‌యుడు.. కేటీఆర్‌కు ఇప్పుడు నెటిజ‌న్ల నుంచి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. `శ‌భాష్ కేటీఆర్‌` అంటూ.. నెటిజ‌న్లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. మాటిచ్చి.. పాప ప్రాణం నిల‌బెట్టారంటూ.. పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. మ‌రి ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. సామాజిక సేవ‌లో ఎప్పుడూ ముందుంటే.. మంత్రి కేటీఆర్.. ఓ పాప‌కు వ‌చ్చిన అరుదైన వ్యాధిని న‌యం చేయించి.. ప్రాణం నిల‌బెట్టారు. ల‌క్ష‌ల రూపాయ‌లు విలువ చేసే వైద్య చికిత్స అందించి చిన్నారి ప్రాణాన్ని కేటీఆర్ నిల‌బెట్టారు.

సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలం సింగీతం గ్రామానికి చెందిన సుమలత, అవినాశ్ల కుమార్తె అక్షయ(2)కు గత ఏడాదిగా మెడ చుట్టూ వాపు పెరుగుతోంది. ఇది క‌ణితిగా మారి ప్రాణాంత‌కంగా ప‌రిణ‌మించింది. ఆసుప‌త్రికి తీసుకువెళ్ల‌గా తక్షణం తొలగించాలని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్సకు రూ.4-6 లక్షలు అవుతుందని చెప్పారు. అంత డబ్బులేని తల్లిదండ్రులు తమ దీన స్థితిని పలువురికి వివరించారు. సామాజిక మాధ్యమాల ద్వారా విషయం మంత్రి కేటీఆర్‌ దృష్టికి వెళ్లింది.

దీనిపై త‌క్ష‌ణ‌మే స్పందించిన కేటీఆర్‌.. ఆ చిన్నారి ప్రాణాలు కాపాడ‌తాన‌ని మాటిచ్చారు. త‌ల్లిదండ్రుల‌కు స్థానిక అధికారుల ద్వారా వెంట‌నే క‌బురు పంపారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల 11న అమెరికన్‌ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌ వైద్యులతో మంత్రి మాట్లాడి ఉచితంగా చికిత్స చేసేలా ఒప్పించారు. దీంతో ఆసుపత్రి రోబోటిక్‌ ఆంకో సర్జన్‌ డాక్టర్‌ జగదీశ్వర్‌గౌడ్‌ శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారు. క‌ణితి తొల‌గించ‌క‌పోతే.. చిన్నారి ప్రాణానికే ముప్పు ఉండేద‌ని వైద్యులు తెలిపారు. కాగా, కేటీఆర్ చొర‌వ‌తో చిన్నారికి చికిత్స ల‌భించ‌డంపై నెటిజ‌న్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. శ‌భాష్ కేటీఆర్ అంటూ కొనియాడుతున్నారు.