Begin typing your search above and press return to search.

కేటీఆర్ ఇరిటేషన్ తో కమలనాథుల్లో పండుగ

By:  Tupaki Desk   |   20 Aug 2019 10:21 AM IST
కేటీఆర్ ఇరిటేషన్ తో కమలనాథుల్లో పండుగ
X
ప్రత్యర్థి ఎంత బలవంతుడైతే.. అంతగా పాలకపక్షం ఉలికిపడుతుంది. అవసరానికి మించిన ప్రాధాన్యత ఇస్తుంది. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో బీజేపీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా టీఆర్ ఎస్ అధినాయకత్వం భావించేది. వారిపై విమర్శలు చేసేందుకు సైతం ససేమిరా అనేవారు. మన స్థాయి ఏంటి? ఆ పార్టీ స్థాయి ఏంటి? అన్న మాటలు వారి మధ్య వినిపించేవి. బీజేపీ నేతల గురించి మాట్లాడి వారి స్థాయిని పెంచాల్సిన అవసరం మనకేంటన్నట్లుగా ఉండేది.

ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నిన్నటి వరకూ లైట్ తీసుకోవాల్సిన పార్టీ కాస్తా ఇప్పుడు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం వచ్చేసిందన్న మాట.. తాజాగా టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే అర్థం కాక మానదు. టీడీపీ.. కాంగ్రెస్ కు చెందిన నేతలు పెద్ద ఎత్తున బీజేపీలోకి చేరిన నేపథ్యంలో నిర్వహించిన సభలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. పథకాల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతుందన్న ఆరోపణలు చేశాయి.

గడిచిన ఐదేళ్ల కేసీఆర్ పాలనలో అవినీతి ముద్ర లేకపోవటమే కాదు.. ఎవరూ ఆ స్థాయిలో విమర్శించింది లేదు. ఆ మాటకు వస్తే.. ప్రధాని మోడీ సైతం కేసీఆర్ సర్కారు అవినీతి లేదన్న సర్టిఫికేట్ ఇవ్వటం మర్చిపోకూడదు. అలాంటిది.. అందుకు భిన్నంగా కేసీఆర్ సర్కారు అవినీతిమయంగా మారిందన్న మాట గులాబీ పార్టీకి ఇబ్బందికి గురి చేసేదే. అందునా.. తాము టార్గెట్ చేసిన రాష్ట్రంలో పాగా వేయటానికి ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే మోడీషాల తీరుపై టీఆర్ ఎస్ ఇప్పుడు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యిందన్న మాట తాజా వ్యాఖ్యల్ని చూస్తే.. ఇట్టే అర్థమైందని చెప్పక తప్పదు.

నిన్న మొన్నటివరకూ తమను పట్టించుకోకుండా.. టీఆర్ ఎస్ ఫోకస్ అంతా కాంగ్రెస్ మీదనే ఉండేదని.. అలాంటిది కేటీఆర్ తాజాగా చేసిన విమర్శల్లో అత్యధికం బీజేపీ మీదనే కావటంపై కమలనాథులు ఖుషీ అవుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తమ బలం పెరిగిందని.. అధికార పక్షం తమ కిచ్చే ప్రాధాన్యత ఎంత పెరిగిందనటానికి తాజాగా కేటీఆర్ చేసిన విమర్శలే నిదర్శమంటూ ప్రైవేటు సంభాషణల్లో మాట్లాడుకోవటం ఆసక్తికరంగా మారింది.