Begin typing your search above and press return to search.

వరంగల్ ప్రచారంలో.. ‘డాలరు.. రూపాయి’

By:  Tupaki Desk   |   15 Nov 2015 9:56 AM IST
వరంగల్ ప్రచారంలో.. ‘డాలరు.. రూపాయి’
X
వరంగల్ ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పరస్పర విమర్శలు.. ఆరోపణలు షురూ అయ్యాయి. ఎన్నికల రేసులో వెనుకబడినట్లుగా కనిపిస్తున్న తెలంగాణ అధికారపక్షం తన అస్త్రశస్త్రాల్ని బయటకు తీస్తోంది. ఇప్పటివరకూ ఉప ఎన్నికల ప్రచారంలో రాని సరికొత్త అంశాలు తాజాగా తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు.. మంత్రి కేటీఆర్ ప్రచారంలో భాగస్వామి అయ్యారు. మరో ఏడు రోజుల పాటు ఆయన ఫోకస్ మొత్తం వరంగల్ ఉప ఎన్నిక మీదనే ఉంటుందని చెబుతున్నారు.

శనివారం ప్రచారం చేసిన సందర్భంగా ఆయన ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. ప్రధాని మోడీకి తెలంగాణ రాష్ట్రం పట్టలేదని.. ఆయన అదికారంలోకి వచ్చి 19 నెలలు అవుతున్నా ఇప్పటివరకూ తెలంగాణ ముఖం చూడలేదని ఎద్దేవా చేశారు.

ప్రధాని మోడీ ఏదైనా చేశారంటే.. అది ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్ లో కలపటమేనని.. తెలంగాణ పట్ల మోడీ వివక్ష ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఈ దేశంలోది కాదా? మోడీ ఈ రాష్ట్రానికి ప్రధాని కాదా?’’ అంటూ ప్రశ్నించిన ఆయన.. మోడీ నేతృత్వం వహిస్తున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలంటూ అసలు పాయింట్కి వచ్చేశారు.

తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదన్న కేటీఆర్.. బీజేపీ అభ్యర్థి దేవయ్య కొత్త డాలర్ అని.. టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ నికార్సయిన రూపాయిగా అభివర్ణించారు. ఇక.. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ అయితే చెల్లని రూపాయిగా ఆయన తేల్చారు. ఇప్పటివరకూ వరంగల్ ఉప ఎన్నిక విషయంలో పెద్దగా భావోద్వేగాల్ని టచ్ చేయని సమయంలో ఎంటర్ అయిన కేటీఆర్.. మోడీ పేరును వరంగల్ ఎన్నికల ప్రచారంలోకి లాగి.. బీజేపీ అభ్యర్థికి గురి పెట్టిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది.