Begin typing your search above and press return to search.

కేటీఆర్ బ్లూ షర్ట్.. దావోస్ టూర్ తర్వాత కొత్త లుక్

By:  Tupaki Desk   |   28 Jan 2020 10:57 AM IST
కేటీఆర్ బ్లూ షర్ట్.. దావోస్ టూర్ తర్వాత కొత్త లుక్
X
మిగిలిన రంగాల వారికి రాజకీయాల్లో ఉన్న వారికి సంబంధించి కొన్ని విషయాల్లో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. గతంలో పొలిటిషియన్ అన్నంతనే ఖద్దరు చొక్కాతో మిలమిల మెరిసిపోయేవారు. మల్లెపువ్వు లాంటి తెల్లటి వస్త్రాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆ ట్రెండ్ ను కాస్త బ్రేక్ చేసింది చంద్రబాబు నాయుడే. ఆ తర్వాత నుంచి మార్పులు వస్తున్నాయి.

ఆ తర్వాతి కాలంలో పెనుమార్పు అంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చెప్పాలి. ఒక ముఖ్యమంత్రి కుమారుడైనప్పటికి సాదాసీదా వస్త్రాలతో ఆయన ఆకట్టుకునే వారు. ఆయన వేసుకునే చొక్కా ఒక్కొక్కటికి రూ.ఐదారు వేలకు తగ్గకున్నా చూసేందుకు మాత్రం ఐదారు వందల మాదిరి ఉంటుంది. అంతేకాదు.. ఒకే ఫార్మాట్ లో ఆయన ఉండేవారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన తన లుక్ ను మార్చుకోలేదు.

ఎప్పుడైనా విదేశీ పర్యటనల సమయంలో మాత్రం జగన్ లోని కుర్రాడు బయటకు వస్తాడే కానీ.. విడి రోజుల్లో మాత్రం అందరిలో కలిసిపోయేలా ఆయన వస్త్రధారణ ఉంటుంది. దీనికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ వస్త్రధారణ ఉంటుంది.

సాధారణంగా వైట్ షర్ట్ తో పాటు.. లైట్ పింక్ కలర్ షర్ట్ ధరించినా.. ఆయన ఓటు ఫార్మల్స్ కే. విదేశీ ప్రతినిధులు వచ్చినా.. విదేశీ పర్యటనల సందర్భం లో సూట్ ధరించే ఆయన.. విడి రోజుల్లో మాత్రం వైట్ షర్ట్ కు.. అప్పుడప్పుడు లైట్ కలర్స్ షర్ట్స్ కు ప్రాధాన్యత ఇస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సోమవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశం సందర్భంగా వేసుకొచ్చిన బ్లూ కలర్ షర్ట్ కాస్త భిన్నంగా ఉందని చెప్పాలి.

కాస్త ముదురు నీలం రంగు చొక్కా కు.. డిజైన్ తో ఉన్న వైనం రోటీన్ కు భిన్నంగా ఆయన్ను నిలిపిందని చెప్పాలి. తరచూ ఆయన వస్త్రధారణకు భిన్నంగా ఆయన తాజా షర్ట్ ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల దావోస్ పర్యటన కు వెళ్లి వచ్చిన తర్వాత కొత్త లుక్ లో మంత్రి కేటీఆర్ కనిపించారని చెప్పక తప్పదు.