Begin typing your search above and press return to search.

తండ్రి అడుగుజాడల్లో కొడుకు కేటీఆర్ నడుస్తున్నారుగా?

By:  Tupaki Desk   |   25 Sept 2020 5:20 PM IST
తండ్రి అడుగుజాడల్లో కొడుకు కేటీఆర్ నడుస్తున్నారుగా?
X
ఇంతకాలం లేని కొత్త కోణాల్ని చూపిస్తున్నారు మంత్రి కేటీఆర్. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఇటీవల కాలంలో విపరీతమైన బజ్ ను సొంతం చేసుకున్న ఆయన.. ఇటీవల కాలంలో తన తండ్రి కేసీఆర్ ను గుర్తుకు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఆ మధ్యన అప్రకటిత కేబినెట్ మీటింగ్ ఒకటి జరిగింది గుర్తుంది కదా? కేబినెట్ మీటింగ్ అంటే ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగాలి. కానీ.. అందుకు భిన్నంగా కేటీఆర్ నాయకత్వాన జరిగిన ఒక సమావేశం అచ్చుగుద్దినట్లు కేబినెట్ ను తలపించినట్లుగా పెద్ద చర్చే జరిగింది.

ఆ సమావేశం మంత్రి కేటీఆర్ శాఖకు సంబంధించినది చెప్పినా.. అందరు మంత్రులు హాజరు కావటం.. అంతా బుద్ధిమంతుల మాదిరి వ్యవహరించిన తీరు ఒక ఎత్తు అయితే.. తన తండ్రి మాదిరే గంటల కొద్దీ సమావేశాన్ని నిర్వహించిన వైనాన్ని చూసిన పలువురు మంత్రులు.. కీలక అధికారులు తండ్రిని తలపించారన్న మాట వచ్చింది. మరికొద్ది రోజుల్లో పట్టభద్రుల స్థానంలో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థానాన్ని తాము సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో మంత్రి కేటీఆర్ ఉన్నారు.

ఈ ఎన్నిక కోసం సరికొత్తగా ప్లాన్ చేస్తున్న ఆయన.. అందుకు తగ్గట్లుగా తయారవుతున్నారు. పట్టభద్రుల ఎన్నికకు స్థానికంగా ఉన్న పార్టీ కార్యకర్తలు ఎంతలా పని చేస్తే అంత చక్కటి ఫలితం ఉంటుంది. గ్రౌండ్ వర్క్ ఏ మాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం ఖాయం. ఇలాంటి విషయాల్లో టీఆర్ఎస్ కు అంత అనుభవం లేదనే చెప్పాలి. తనకున్న ‘బలం’తో బండి లాగించే తీరుకు పట్టభద్రుల ఎన్నిక పూర్తిగా భిన్నమన్నది మర్చిపోకూడదు. చూస్తుంటే.. ఈ విషయాల్ని కేటీఆర్ గుర్తించినట్లున్నారు.

అందుకే ఆయనే స్వయంగా రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామానికి చెందిన గ్రాడ్యుయేట్ శ్రావణితో ఆయన నేరుగా మాట్లాడారు. గ్రామ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న ఆమె ఎలా పని చేస్తున్నారన్న విషయాన్ని ఆరా తీశారు. తాను చెప్పిన విషయాలన్ని అర్థమయ్యాయా? అని అడిగిన కేటీఆర్.. ఏమైనా అనుమానాలు ఉంటే అడగాలని కోరారు.

చెప్పిన విషయాలన్ని అర్థమైనట్లుగా చెప్పిన ఆమె.. తనకు తానే స్వయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రామ ఇన్ ఛార్జిగా బాధ్యతలు తీసుకొని ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఆమె మాటలకు సంతసించిన కేటీఆర్.. థ్యాంక్యూ బేటా.. థ్యాంక్యూ వెరీమచ్.. ఇదే స్ఫూర్తిని పదిమందిలో నింపు.. మీది రుస్తాపూర్ కదా? అంటూ మాట్లాడిన మాటకు శ్రావణి సంతోషంతో ఉప్పొంగిపోయింది. రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తానని చెబుతోంది. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా పని చేయాలన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ బాగానే పట్టేసినట్లుగా కనిపించట్లేదు?