Begin typing your search above and press return to search.

గడ్డం పెంచిన ప్ర‌తోడు గబ్బర్‌ సింగ్ అయిపోతాడా?

By:  Tupaki Desk   |   10 April 2018 11:30 PM GMT
గడ్డం పెంచిన ప్ర‌తోడు గబ్బర్‌ సింగ్ అయిపోతాడా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - ఆ పార్టీ యువ‌నేత కేటీఆర్ అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా...కాంగ్రెస్ పార్టీపై విరుచుకుప‌డుతున్నారు. సంద‌ర్భం ఏదైనా కాంగ్రెస్ టార్గెట్ చేసేందుకు కేటీఆర్ ఏమాత్రం వెనుక‌డుగు వేయ‌ని సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రోమారు త‌మ ఇంటికి - జాతీయ రాజ‌కీయాల‌కు లింక్ పెట్టి కాంగ్రెస్‌ పై మండిప‌డ్డారు కేటీఆర్‌. త‌మ ఇలాకా అయిన సిరిసిల్లలో ఆయ‌న మాట్లాడుతూ వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయద్దేరినట్టు కాంగ్రెస్ నాయకుల కథ ఉందని ఎద్దేవా చేశారు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులుచేయిస్తానన్న చందంగా కాంగ్రెస్ తీరుందని కేటీఆర్ ఎద్దేవాచేశారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ది డ్రామాలు - ద్రోహాలు - వంచనలతోకూడిన చరిత్రని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చరిత్ర చెప్తే చాలామంది సిగ్గుపడతారన్నారు. అలాంటి కాంగ్రెస్ ఈ రోజు నీతులు చెప్తే విని - మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరని భట్టివిక్రమార్కనుద్దేశించి అన్నారు. గడ్డం పెంచిన ప్రతీ ఒక్కడు గబ్బర్‌ సింగ్ అయిపోతాడా? అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. గడ్డం తీయను కనుక నాకే ఓట్లు వేయాలి అని అడుగటమేంటని ప్రశ్నించారు. టీఆర్‌ ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో చేస్తున్న పనులను దేశం మొత్తం చూస్తున్నదని చెప్పారు.

తెలంగాణ ప్ర‌భుత్వం సంక్షేమ పాల‌న‌పై మాజీ ప్రధాని మన్మోహన్‌ కు కూడా అర్థయింది కానీ.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు మాత్రం అర్థం కావడం లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు.. చేయాల్సిన నీచమైన పనులన్నీ చేసి.. ఈ రోజు కల్లబొల్లి మాటలు చెప్పడానికి కాంగ్రెస్ నాయకులు బస్సుల్లో బయలుదేరుతున్నారని మండిపడ్డారు. ముదిగొండలో ఆరుగురిని కాల్చి చంపిన పార్టీ మాటలు వింటుంటే వేదాలు వల్లించే దెయ్యాలు కూడా సిగ్గుపడతాయన్నారు. రైతులకు పెట్టుబడి కింద ఎకరానికి రెండు పంటలకు రూ.8 వేలు ఇస్తానని చెప్పడంతో కాంగ్రెసోళ్ల కడుపులు మండుతున్నాయని చెప్పారు.

తెలంగాణ‌లో సంక్షేమం - అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతున్నార‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు సీఎం మనుమడు - మనుమరాలు ఏ సన్నబియ్యంతో అన్నం తింటున్నారో అదే సన్నబియ్యంతో హాస్టళ్లు - పాఠశాలల్లో పేదింటి పిల్లలకు కడుపునిండా బువ్వ పెడుతున్నామని తెలిపారు. మహిళలు బిందెలు పట్టుకుని వెళ్లాల్సిన దుస్థితిలేకుండా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. భద్రాద్రిలో రూ.వందకోట్లతో రామాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మణుగూరులో విద్యుత్ కేంద్రం, కొత్తగూడెంలో కేటీపీఎస్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. పేదింటి ఆడకూతురు పెళ్లీడుకొస్తే కులమతాలతో నిమిత్తం లేకుండా లక్షానూటపదహార్లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని చెప్పారు. గతంలో నేను రానుబిడ్డో సర్కారు దవాఖానాకు అని సినిమా కవులు పాటలురాస్తే.. నేడు కేసీఆర్ కిట్ పథకం వచ్చాక 30-50 శాతం వరకు ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలు పెరుగుతున్నాయని, పేద గర్భిణులు కూలిపనులకు వెళ్లాల్సిన దుస్థితిని తొలిగిస్తూ వారికి రూ.12వేలు అందజేస్తున్నామని చెప్పారు.