Begin typing your search above and press return to search.

దేశంలో తెలంగాణ భాగమేనా? మోడీపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   9 Nov 2020 10:30 AM IST
దేశంలో తెలంగాణ భాగమేనా? మోడీపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
X
సహనం నశిస్తే.. ప్రధాని మోడీనైనా నిలదీస్తామంటూ ఈ మధ్యన మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టి సందర్భంగా వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రధాని మోడీని ఉద్దేశించి.. ఘాటు వ్యాఖ్యలు చేసే విషయంలో ఎవరూ అంత చొరవ తీసుకోని పరిస్థితుల్లో.. కేటీఆర్ ఆ కొరతను తీరుస్తున్నారని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నేతలు తనను టార్గెట్ చేస్తుంటే.. కేటీఆర్ వారికి సమాధానం చెప్పకుండా.. ప్రధాని మోడీపై విమర్శలు చేయటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

ఇటీవల హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తిన వర్షాలు.. వరదల నేపథ్యంలో కేంద్ర సాయం కోసం లేఖ రాస్తే.. ప్రధాని మోడీ ఇంతవరకు స్పందించలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాస్తూ రూ.1350 కోట్ల సాయాన్ని కోరారు. ఇప్పటివరకు ప్రధాని నుంచి స్పందన లేదన్నారు. అదే సమయంలో భారీ వర్షాలతో నష్టపోయామంటూ కర్ణాటక ముఖ్యమంత్రి లేఖ రాసిన వెంటనే రూ.669కోట్ల మొత్తాన్ని విడుదల చేశారని.. అదే రీతిలో గుజరాత్ ముఖ్యమంత్రి లేఖ రాసినా మోడీ స్పందిస్తున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రం దేశంలో భాగమేనా? అంటూ మండిపడిన కేటీఆర్.. కేంద్ర సాయం కోసం 25 రోజుల క్రితం కోరినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవటాన్ని తప్పు పట్టారు. హైదరాబాద్ ప్రజలకు సాయం చేయాల్సిన అవసరం లేదని ప్రధాని మోడీ భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ కు నిధులు తెచ్చే విషయంలో నిస్సహాయంగా మారరంటూ భారీ పంచ్ విసిరారు.

వరదలతో నష్టపోయిన హైదరాబాద్ ను ఆదుకునేందుకు కేంద్రమంత్రి.. నలుగురు బీజేపీ ఎంపీ ఏం చేశారని ప్రశ్నించిన ఆయన.. ఒక్క చిల్లిగవ్వ కూడా ఇవ్వకపోవటాన్ని తప్పు పట్టారు. గ్రేటర్ ఎన్నికల్లో మన నగరం.. మన బీజేపీ అంటూ నినాదాన్ని షురూ చేసిన వైనాన్ని తప్పు పట్టారు. కేంద్రాన్ని... ప్రధానిని ఇంతలా తప్పు పట్టిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో తాము ఓడిన నియోజకవర్గాలకు నిధులను ఇచ్చే విషయంలో ఎందుకు పక్షపాతాన్ని ప్రదర్శించటం? అంతేనా.. ఎన్నికలు జరిగినప్పుడు అధికారంలో ఉన్న తమకు కాకుండా మరెవరికైనా ఓటు వేస్తే మురిగిపోతుందన్న మాటలు చెప్పినప్పుడు.. ప్రధాని మోడీని సంధించిన ప్రశ్నలు తమకు వర్తిస్తాయన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతారో?