Begin typing your search above and press return to search.

ఇష్టారాజ్యంగా ఆడేసుకుంటే చిన్నసారుకు కోపం రాదా ఏమిటి?

By:  Tupaki Desk   |   23 Aug 2019 10:50 AM IST
ఇష్టారాజ్యంగా ఆడేసుకుంటే చిన్నసారుకు కోపం రాదా ఏమిటి?
X
మీ మీద అదే పనిగా విష ప్రచారం జరుగుతుందనుకోండి? మీరేం చేస్తారు? ఎలా రియాక్ట్ అవుతారు? మంచి చెప్పకున్న ఫర్లేదు.. చెడుగా చెప్పటం.. అందునా అబద్ధాలు చెప్పటం షురూ చేసిన వారు ఎవరైనా సరే అస్సలు వదిలిపెట్టరు. ఇవాళ ఇలా వదిలేస్తే.. రేపొద్దున మరిన్ని చెప్పటం మొదలెట్టి.. గ్లోబల్ ప్రచారంతో ఇజ్జత్ మొత్తం సంక నాకిపోవటం ఖాయమని భావిస్తారు. మీరే కాదు.. ఎవరైనా ఇలానే ఆలోచిస్తారు. ఇలా అందరిలా ఆలోచిస్తే ఆయన టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకవుతారు? అన్నింటికిమించి చిన్నసారు కేటీఆర్ ఎందుకవుతారు?

టార్గెట్ చేసి మరీ.. వ్యూహాత్మకంగా తమపై మాటల యుద్ధానికి దిగుతున్న కమలనాథుల కత్తుల్లాంటి మాటలతో గులాబీ దళానికి తగులుతున్న గాయాలు అన్ని ఇన్ని కావు. ఉద్యమ పార్టీగా.. తమ నోటి నుంచి వస్తే చాలు.. ఊగిపోయే ఉద్వేగం.. అంతకు మించిన భావోద్వేగం ఉండే తమ పార్టీతో పెట్టుకోవటం అంత తేలికైన విషయం కాదన్నది గులాబీ బాస్ నమ్మకం. అయితే.. ఎంత మంచి కత్తి అయినా సరే.. రోజుల తరబడి వాడటం మానేస్తే తప్పు పట్టే రీతిలో.. ప్రస్తుతం తమ పార్టీ పరిస్థితి ఉందన్న చిన్న పాయింట్ ను కేటీఆర్ మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది

ఉద్యమవేళ ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన టీఆర్ ఎస్.. తర్వాతి కాలంలో అధికారం అరచేతిలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయానికి మించిన విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయటంతో పార్టీ నేతలే కాదు.. క్యాడర్ కూడా కొత్త అంశాల మీద దృష్టి పెట్టటం షురూ అయ్యింది. అదిప్పుడో పెద్ద జబ్బుగా తయారై.. పార్టీకి పెద్ద జడత్వంగా మారింది. ఈ కారణంతోనే.. ఎవరైనా పార్టీని ఉద్దేశించి ఏదైనా అంటే.. తమను కాదన్నట్లుగా వ్యవహరించటం ఎక్కువైంది.

ఉద్యమవేళలో ఎవరైనా కించిత్ మాట అన్నా.. ఒకవేళ అనకున్నా.. తమకు తాముగా అవకాశాలు వెతుక్కొని మరీ తాట తీసే దశ నుంచి.. ఎవరేమన్నా లైట్ తీస్కో బాసూ అన్నట్లుగా గులాబీ దళం వ్యవహరిస్తుందన్న విమర్శ లేకపోలేదు. ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలున్నాయని చెప్పాలి. కొద్ది రోజులుగా తెలంగాణ బిగ్ బాస్ కేసీఆర్.. ఆయన పాలనతో పాటు.. చిన్న బాసు కేటీఆర్ మీదా ఇతర నేతల మీద విమర్శలతో విరుచుకుపడుతోంది బీజేపీ. దీంతో.. కమలనాథుల విమర్శలు.. ఆరోపణలకు రియాక్ట్ అవుతూ వారి మీద డైలీ బేసిస్ లో ఫైట్ చేస్తున్నారు కేటీఆర్.

గతంలో ఎప్పుడూ లేని రీతిలో అదే పనిగా మాటల యుద్ధంలో అడ్డంగా బుక్ అవుతున్నారు కేటీఆర్. దీంతో.. తెలివి తెచ్చుకున్న ఆయన.. తాజాగా మాట మార్చేసినట్లుగా కనిపిస్తోంది. అబద్ధాలను పదే పదే ప్రచారం చేయటం ద్వారా వాటినే నిజాలుగా ప్రజల్ని నమ్మించాలన్నది బీజేపీ ప్రయత్నం అని.. అలాంటి వారి అబద్ధాల ప్రచారాన్ని తాను రోజూ ఖండించలేని తేల్చేశారు.

తాను కత్తి తిప్పను కానీ.. పార్టీ వేదికల మీదా.. సామాజిక మాధ్యమాల ద్వారా తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. యుద్ధం చేస్తే మేమే చేయాలే.. మీరు కాదన్నట్లుగా బద్ధకాన్ని టీఆర్ ఎస్ నేతల నోటికి ఆంక్షల ప్లాస్టర్లు వేసిన కేటీఆర్.. హటాత్తుగా కత్తి డాలు పట్టుకొని ఫైట్ చేయమంటే గులాబీ తమ్ముళ్లకు కష్టం కాదా? ఆ చిన్న పాయింట్ చిన్నసారుకు ఎందుకు అర్థం కావట్లేదు?