Begin typing your search above and press return to search.

హైదరాబాద్ అభివృద్ధికి రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టాం: కేటీఆర్

By:  Tupaki Desk   |   16 Sep 2020 5:31 PM GMT
హైదరాబాద్ అభివృద్ధికి రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టాం: కేటీఆర్
X
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ సర్కార్ పలుమార్లు బహిరంగ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఎన్డీఏ, యూపీఏలకు ప్రత్యామ్నాయం ఉండాలన్న వాదనను సీఎం కేసీఆర్ తెరపైకి తెచ్చారు. ఇక, కేంద్రం చేపట్టబోతోన్న విద్యుత్ సంస్కరణలపై కేసీఆర్ జాతీయ స్థాయి ఉద్యమానికి సైతం సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. నిధులు విడుదల చేయకుండా రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.కేంద్రం బకాయిలు ఇవ్వకున్నా తెలంగాణలో అభివృద్ధి పనులు ఆగవని కేటీఆర్ రామారావు వెల్లడించారు. కేంద్రం నుంచి బకాయి నిధులు రాకున్నా, జీహెచ్ఎంసీకి నిధుల కొరత ఉన్నా.. నగరంలో ఆస్తిపన్ను, నీటి పన్నులను పెంచడం లేదని చెప్పారు. జీహెచ్ఎంసీతోపాటు తెలంగాణలోని అన్ని మునిసిపాలిటీలకు నిధుల పంపిణీలో జాప్యం జరగడం లేదని శాసనమండలిలో కేటీఆర్ వెల్లడించారు.

జీహెచ్‌ఎంసీకి ప్రతి నెలా 78 కోట్లు కేటాయిస్తున్నామని, రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీకి 70 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పనకు 67వేల 35 కోట్లు కేటాయించామని వెల్లడించారు. రెవెన్యూ ఖర్చు కలిపితే హైదరాబాద్ అభివృద్ధికి చేసిన ఖర్చు లక్ష కోట్ల రూపాయలు దాటుతుందని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్.ఆర్.డీ.పీ. ద్వారా అద్బుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ వరకు దేశంలో ఎక్కడ లేని విధంగా 11 వేల పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. త్వరలోనే మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీస‌ర్‌ల నియామ‌కాలు చేప‌డ‌తామ‌ని కేటీఆర్‌ ప్ర‌క‌టించారు.