Begin typing your search above and press return to search.

తండ్రికి కొత్త పేరు పెట్టిన కేటీఆర్‌

By:  Tupaki Desk   |   21 Aug 2016 12:00 PM IST
తండ్రికి కొత్త పేరు పెట్టిన కేటీఆర్‌
X
త‌న తండ్రి - తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌ రావుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కొత్త పేరు పెట్టారు. పుర‌పాలక శాఖ మంత్రి అయిన కేటీఆర్ హైటెక్స్‌ లో జ‌రిగిన‌ దక్షిణాది ఆర్కిటెక్ట్‌ ల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా త‌న తండ్రి - సీఎం కేసీఆర్ చేస్తున్న సేవ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ఆయ‌న చీఫ్ ఆర్కిటెక్ట్‌ గా మారిపోయార‌ని ప్ర‌శంసించారు.త‌మ హయాంలో నిధులు మాత్ర‌మే మంజూరు చేయ‌డం లేద‌ని పేర్కొంటూ మ‌న‌సు పెట్టి నిరంతరం ప‌నిచేస్తున్నామ‌ని చెప్పారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన‌ భాగ్యనగరాన్ని విశ్వనగరాల సరసన నిలబెట్టేందుకు ప్రయత్నిస్తూనే.. విశిష్టమైన చరిత్ర గల నగర సంస్కృతి - సంపద పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు నగరాభివృద్దికు భారీగా నిధులు కేటాయించ‌డ‌మే కాకుండా మ‌న‌సు పెట్టి ప‌ని చేస్తూ "చీఫ్ ఆర్కిటెక్ట్‌"గా మారార‌ని కితాబిచ్చారు. నగరాలను అంతర్జాతీయంగా తీర్చిదిద్దే క్రమంలో కొన్ని ప్రభుత్వాలు ప్రాథమిక విషయాలపై పెద్దగా దృష్టి సారించవని - త‌మ సీఎం కేసీఆర్‌ మాత్రం రహదారులు - డ్రైనేజీలు - వరదనీటి కాల్వలు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి దాదాపు రూ.13 వేల కోట్ల‌ను (సుమారు 2 బిలియన్ డాలర్లు) ఖర్చు చేస్తున్నారని కేటీఆర్‌ వెల్లడించారు. దేశంలో నగర ప్రాంతాలు ముప్పయ్ శాతం ఉంటే - తెలంగాణలో 42 శాతం ఉంద‌ని కేటీఆర్ చెప్పారు. ఇది అతివేగంగా అభివృద్ధి చెందుతూ త్వరలో యాభై శాతానికి చేరుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

చెన్నైలో 21 రోజులు వర్షం పడినప్పుడు - ముంబైలో వరుణుడు ప్రకోపించినప్పుడు.. ఆ నగరాలన్నీ అతలాకుతలం అయ్యాయని.. హైదరాబాద్‌ లో మాత్రం అలాంటి తీవ్రమైన పరిస్థితులు ఎన్నడూ ఉత్పన్నం కాలేదని కేటీఆర్ అన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండటానికి జీహెచ్‌ ఎంసీ - జలమండలి వంటివి విరామమెరుగక కృషి చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ లో ఐదు వేరువేరు మాస్టర్ ప్లాన్లు ఉన్నాయని.. వాటన్నింటినీ క్రోడీకరించి నగరానికంతటికీ ఒకే బృహత్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. తాను ఐదు శాఖలను నిర్వహిస్తున్నప్పటికీ.. పురపాలక శాఖే అన్నిటికంటే క్లిష్టమైనదని, భారతదేశంలోని నగర స్థానిక సంస్థల వ్యవస్థలో.. వాటి పనితీరులో ఎక్కడెక్కడ లోపాలున్నాయో స్పష్టంగా అర్థమైందని కేటీఆర్ చెప్పారు.