Begin typing your search above and press return to search.

నాన్న మూణ్నెళ్ల సినిమా గురించి మరిచావా కేటీఆర్‌?

By:  Tupaki Desk   |   7 July 2015 10:47 AM IST
నాన్న మూణ్నెళ్ల సినిమా గురించి మరిచావా కేటీఆర్‌?
X
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించమని కోరినప్పుడు ఏడాది ఒకసారి విడుదలయ్యే సినిమా గురించి మాట్లాడటం అనవసరం అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

''అది సంవత్సరానికి ఒకసారి విడుదలయ్యేసినిమా. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది'' అంటూ పవన్‌ను ఉద్దేశించి కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారు. అంటే.. రాజకీయ నాయకుడు అన్న వ్యక్తి నిత్యం టచ్‌లో ఉండాలని.. తరచూ మాట్లాడాలననది కేటీఆర్‌ భావనలా ఉంది. అయితే..ఇలాంటి మాటలు చెబుతున్న కేటీఆర్‌ గతాన్ని మర్చిపోయినట్లున్నారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ చాలా సమయాల్లో అందుబాటులో ఉండేవారు కాదు. అంతదాకా ఎందుకు ఆయన పార్టీ ఆఫీసుకు సైతం రెగ్యులర్‌గా వచ్చేవారు కాదు. వస్తున్నారని సమాచారం ఇచ్చి మరీ గైర్హాజరు కావటం కేసీఆర్‌కే చెల్లేది.

నెలల తరబడి మీడియాకు అందుబాటులో లేకుండా.. తనకు నచ్చినప్పుడు..తనకు అనుకూలంగా ఉన్న సందర్భాల్లో మాత్రమే ఆయన బయటకు వచ్చేవారు. తనకు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడింది చాలా తక్కువ. పవన్‌ది సంవత్సరానికి ఒకసారి విడుదలయ్యే సినిమా అయితే.. ఒక పార్టీ అధినేతగా.. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధులున్న కేసీఆర్‌ సైతం కొద్దినెలలకు ఒకసారి మాత్రమే మీడియాతో మాట్లాడేవారు.

పవన్‌ విషయాన్ని ప్రశ్నించి కేటీఆర్‌.. గతంలో తన తండ్రి వైఖరిని మర్చిపోయినట్లున్నారు. కీలకస్థానాల్లో ఉన్న వారు గతాన్ని మర్చిపోవటం అంత మంచిది కాదేమో. ఏదైనా విషయంపై స్పందించే సమయంలో తప్పించుకునేందుకు బురద జల్లితే.. అది తమకు కూడా అంటుందన్న విషయాన్ని కేటీఆర్‌ లాంటి వారు మర్చిపోకుండా ఉంటే మంచిది.