Begin typing your search above and press return to search.

డిప్యూటీ స్పీక‌ర్ మాస్క్ పెట్టుకో అంటే విన‌లే.. అందుకే వైర‌స్ వ‌చ్చింది: కేటీఆర్‌

By:  Tupaki Desk   |   8 July 2020 11:10 PM IST
డిప్యూటీ స్పీక‌ర్ మాస్క్ పెట్టుకో అంటే విన‌లే.. అందుకే వైర‌స్ వ‌చ్చింది: కేటీఆర్‌
X
హోంమంత్రి మొద‌లు ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఓ ఉప స‌భాప‌తి కూడా తెలంగాణ‌లో వైర‌స్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. వైర‌స్ వ్యాప్తి ఉన్న విషయం తెలిసి కూడా కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు నిర్ల‌క్ష్యం చేశారు. క‌నీస జాగ్ర‌త్త‌లు కూడా పాటించ‌లేదు. అందుకే వైర‌స్ బారిన ప‌డ్డార‌ని ఐటీ శాఖ మంత్రి కె.తార‌క రామారావు ప్ర‌క‌టించారు. ముఖ్యంగా డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు ఉద్దేశించి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప‌ద్మారావుకు తాను జాగ్ర‌త్త‌లు చెప్పినా వినిపించుకోలేద‌ని తెలిపారు.

ఇటీవ‌ల ఉప స‌భాప‌తి ప‌ద్మారావుకు వైర‌స్ సోకిన విష‌యం తెలిసిందే. దీనిపై తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ విష‌య‌మై స్పందించి మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావుతో క‌లిసి తాను పాల్గొన్నాన‌ని, ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు మాస్క్ పెట్టుకోవాల‌ని సూచించినా పెట్టుకోలేదని తెలిపారు. దాని ప్ర‌భావ‌మే మరుసటి రోజే ప‌ద్మారావుకు వైర‌స్ వ్యాపించింద‌ని మంత్రి కేటీఆర్ చెప్పారు. వైర‌స్ మరణాల కంటే లాక్ డౌన్ తో సంభవించే మరణాలే ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. వైర‌స్‌ కట్టడికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని వివ‌రించారు. వైర‌స్ కట్టడిలో సీఎం కేసీఆర్ ప‌రాజ‌యం పొందార‌ని రాజకీయ విమర్శలు చేసేవారు పైశాచిక ఆనందం పొందడం కోసమేన‌ని తెలిపారు. ఈ విష‌యంలో తాము కూడా కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేయొచ్చని.. కానీ ఇది సరైన సందర్భం కాదని.. విమర్శలు చేయడం లేదని చెప్పారు. ప్రభుత్వ తప్పులు కూడా ఎక్కడో ఒక చోట ఉంటాయని.. అవి పట్టుకుని బూచీగా చూపడం తప్పని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విధంగా మంత్రి కేటీఆర్ ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లపై బ‌దులిచ్చారు.