Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు బ్ర‌హ్మంగారు గుర్తుకు వ‌చ్చారే!

By:  Tupaki Desk   |   3 Nov 2018 10:49 AM IST
కేటీఆర్ కు బ్ర‌హ్మంగారు గుర్తుకు వ‌చ్చారే!
X
రాజ‌కీయ ప్ర‌యోజ‌న‌మే ల‌క్ష్యంగా సాగుతున్న ప్ర‌జాకూట‌మి కార్యక‌లాపాల‌పై గులాబీ బ్యాచ్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తోంది.ఎన్నిక‌ల‌కు వెళ్లినంత‌నే న‌ల్లేరు మీద న‌డ‌క‌లా సాగుతుంద‌నుకున్న దానికి భిన్నంగా ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టంపై కేటీఆర్ అండ్ కో తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.

టార్గెట్ కూట‌మి.. టార్గెట్ బాబు.. కోదండ‌మే ల‌క్ష్యంగా విరుచుకుప‌డుతున్నారు. కూట‌మికి ఒక రూపు ఇచ్చి.. పొత్తు లెక్క‌ల్ని వ్యూహాత్మ‌కంగా నిలిపిన తీరుతో గులాబీ బ్యాచ్ కిందామీదా ప‌డుతోంది. తాము అభ్యర్థుల్ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై ఒత్తిడి పెరిగి వారు సైతం అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టిస్తార‌ని వేసిన ఎత్తు చిత్తు కావ‌టంతో.. వైరి ప‌క్షం అభ్య‌ర్థులు ఎవ‌ర‌న్న ఉత్కంట అంత‌కంత‌కూ పెరుగుతోంది.

ఇలాంటి వేళ‌.. వ్యూహాత్మ‌కంగా ఒక‌టి త‌ర్వాత ఒక‌టి చొప్పున నెమ్మ‌దిగా సాగుతున్న ప‌రిణామాలు.. కూట‌మిని ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నాటుకునే చేస్తున్న ప్ర‌య‌త్నాల్ని గుర్తించిన గులాబీ బ్యాచ్ ఇప్పుడు ఎదురుదాడిని తీవ్ర‌త‌రం చేసింది. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు భేటీ కావ‌టం..కాంగ్రెస్ తో టీడీపీ చెట్టాప‌ట్టాలు వేసుకోవ‌టం లాంటి ప‌రిణామాల‌పై టీఆర్ ఎస్ ముఖ్య‌నేత‌లు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

చంద్ర‌బాబు.. కోదండం రాంలు ల‌క్ష్యంగా విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధిస్తూ.. తెలంగాణ సెంటిమెంట్‌ ను రాజేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా హ‌రీశ్‌.. కేటీఆర్ లు చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. తెలంగాణ‌కు అడుగ‌డుగునా అడ్డుప‌డిన బాబుకు వ్య‌తిరేకంగా లేఖ‌లు రాసి విద్యార్థులు ప్రాణత్యాగాల‌కు పాల్పడిన వైనాన్ని గుర్తు చేసిన హ‌రీశ్ రావు.. బాబుతో క‌లిస్తే అమ‌ర‌వీరుల ఆత్మ‌లు క్షోభించ‌వా? అంటూ హ‌రీశ్ నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ ఆత్మ‌గౌర‌వాన్ని బాబు.. కోదండ‌రాంల‌కు తాక‌ట్టు పెట్ట‌టం ఏమిట‌ని నిల‌దీస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజా మాజీ మంత్రి.. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మ‌రో అడుగు ముందుకేసి.. బాబు.. కోదండ‌రాంల‌తో పాటు కాంగ్రెస్ పైనా విమ‌ర్శ‌ల్ని మ‌రింత తీవ్ర‌త‌రం చేశారు. ముస‌లి న‌క్క కాంగ్రెస్‌.. గుంట‌న‌క్క చంద్ర‌బాబులు ఒక‌టై వ‌స్తున్నార‌ని.. రాష్ట్రంలో బ్ర‌హ్మంగారు చెప్పిన‌ట్లే జ‌రుగుతోంద‌ని.. క‌ల‌వ‌రు అనుకున్నోళ్లు ఒక్క‌టి అవుతున్న‌ట్లుగా కేటీఆర్ వ్యాఖ్యానించారు.

బ‌తికి ఉన్న‌ప్పుడు పిల్ల‌ను ఇచ్చిన మామ‌కు వెన్నుపోటు పొడిచిన చంద్ర‌బాబు.. ఎన్టీఆర్ మ‌ర‌ణించిన త‌ర్వాత కూడా ఆయ‌న‌కు మరోసారి వెన్నుపోటు పొడిచిన‌ట్లుగా అభివ‌ర్ణించారు. కాంగ్రెస్‌తో క‌ల‌వ‌టం ద్వారా మ‌రోసారి వెన్నుపోటు పొడిచార‌న్నారు. కేసీఆర్ ను దించాల‌న్న ఆరాటం త‌ప్పించి బాబు.. కాంగ్రెస్‌ల‌కు మ‌రో ఆలోచ‌న లేద‌న్నారు. మొత్తానికి బాబు.. కాంగ్రెస్ పొత్తుల‌పై కేటీఆర్ గ‌తాన్ని తవ్వి తీయ‌ట‌మే కాదు.. పురాణ పురుషులు చెప్పిన మాటల్ని సైతం త‌న‌కు త‌గిన‌ట్లుగా అన్వ‌యించుకోవ‌టం క‌నిపించ‌క మాన‌దు.