ఆంధ్రా రాజకీయాలు ఓకే.. వార్తలొద్దు
By: Tupaki Desk | 24 Jan 2019 10:21 AM IST‘‘ఆంధ్రా రాజకీయాలు కావాలి కానీ.. అక్కడి వార్తలొద్దు’’ అంటూ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన హాట్ కామెంట్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ ఎడిషన్లలో ఆంధ్రా వార్తలు ఎందుకు అని కేటీఆర్ ప్రశ్నించడం అందరినీ నివ్వెరపరిచింది. మొన్నటికి మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జీహెచ్ ఎంసీ లో ప్రచారం చేసిన కేటీఆర్ ‘ఆంధ్ర సోదరులు’ మాకు ఆప్తులన్నాడు. ఆ తర్వాత కూకట్ పల్లిలో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి అభినందన సభలో కలిసి మెలిసి సాగుదాం అంటూ పిలుపునిచ్చారు. ఇలా ఆంధ్రాపై ప్రేమను చాటి ఇప్పుడు లోపలున్న వ్యతిరేకతను కేటీఆర్ తాజాగా బయటపెట్టేశాడు.
తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి తరుఫున గెలిచిన ఏకైక పూర్వ జర్నలిస్టు ప్రస్తుత ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సన్మాన కార్యక్రమం హైదరాబాద్ లో మీడియా మిత్రుల సమక్షంలో నిర్వహించారు. క్రాంతికిరణ్ ను అభినందించే క్రమంలో కేటీఆర్ మరోసారి ఆంధ్రా వ్యతిరేకతను బయటపెట్టేశాడు. ‘జర్నలిజం-తెలంగాణ-ఆంధ్రప్రదేశ్’ అంశాలపై కేటీఆర్ మాట్లాడారు. తాను అప్పట్లో ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడ తెలుగు దినపత్రికలో ఆంధ్రా ఎడిషన్ చూశానని.. అందులో ఒక్క తెలంగాణ వార్త లేదని వాపోయాడు. అలాంటప్పుడు తెలంగాణ ఎడిషన్లలో ఆంధ్రా వార్తలు ఎందుకంటూ కేటీఆర్ తాజాగా ప్రశ్నించారు.
మీడియా హౌస్ లన్నీ హైదరాబాద్ లోనే ఉండడంతో ఎక్కువగా తెలంగాణ వార్తలకే ప్రాధాన్యం ఉంటుంది. ఒకటి అరా మాత్రం ఆంధ్రావార్తలుంటాయి. హైదరాబాద్ ఎడిషన్ లో మాత్రం రాజధానిలో ఉన్న సీమాంధ్రులను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆంధ్రావార్తలు వేస్తుంటారు.
ఇలా ప్రజల అభీష్టం మేరకు ఒకటి అరా ఆంధ్రావార్తలను కూడా తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ జీర్ణించుకోకపోవడం.. అదీ మీడియా సాక్షిగా బయటపెట్టడం ఆంధ్రావైఖరిని తేటతెల్లం చేసింది. వారి ఓట్లు కావాలి.. వార్తలొద్దు అంటే ఎలా అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
