Begin typing your search above and press return to search.

తప్పుగా అర్థం చేసుకోవద్దుంటున్న కేటీఆర్

By:  Tupaki Desk   |   14 March 2017 4:42 PM IST
తప్పుగా అర్థం చేసుకోవద్దుంటున్న కేటీఆర్
X
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ పై కాంగ్రెస్‌ లో భారీగా కనిపించిన అప్పుపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అధికార టీఆర్ ఎస్ పార్టీ రంగంలోకి దిగింది. ఏకంగా సీఎం కేసీఆర్ తనయుడు - మంత్రి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలు తిప్పి కొట్టారు. సుదీర్ఘ కాలం తర్వాత టీఆర్‌ ఎస్‌ ఎల్పీలో కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టుతోందని, బాకీల తెలంగాణగా మారుస్తున్నారని అనడం సరికాదన్నారు. ఆర్థిక ఈటెల రాజెందర్ నాలుగో బడ్జెట్ పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని, ఇది సమతూకమైన అభివృద్ధి లక్ష్యం తీర్చిదిద్దిన బడ్జెట్ అని కేటీఆర్ అన్నారు. లక్షా 49 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు కాంగ్రెస్ నేతల కళ్ళు బైర్లు కమ్మడంతో అడ్డం పొడుగు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అప్పుల తెలంగాణ అంటూ పదే పదే మాట్లాడుతున్నారని ఏదైనా అప్పు తీసుకుంటే ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడే అన్న విషయం తెలివైన కాంగ్రెస్ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. ఇది అప్పు అనడం శుద్ధ తప్పు అని కేటీఆర్ తెలిపారు. అప్పు తెచ్చి నాలుగు పైసలు సంపద అదనంగా సృష్టిస్తే తప్పా ? అని కాంగ్రెస్ నేతలను కేటీఆర్ నిలదీశారు. తెలంగాణా జీడీపీ పై కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలే తాము చెబుతున్నామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. భారత్ లో జీడీపీ విషయం లో తెలంగాణా 11 వ స్థానం లో ఉందని పేర్కొన్నారు. ఇది శ్రీలంక కంటే ఎక్కువ అని తెలిపారు. దేశం జీడీపీ కన్నా తెలంగాణా జీడీపీ పెరుగుదల రేటు ఎక్కువ అని కేటీఆర్ తెలిపారు. జీడీపీతో పోలిస్తే తెలంగాణా అప్పులు తక్కువ అని అన్నారు. జీడీపీ అప్పుల నిష్పత్తి తెలంగాణ లో 17 శాతం మాత్రమేనని, మిగతా రాష్ట్రాల జీడీపీ అప్పుల నిష్పత్తి 21 శాతమని వివరించారు. ఇవి అప్పులు కాదు పెట్టుబడులేనని తేల్చి చెప్పారు.

“కాంగ్రెస్ పాలన లో ఎపుడైనా మంచి నీళ్లు ఇచ్చారా? మేము తెచ్చే అప్పు ప్రతి పైసా కు లెక్క చెబుతాం. గుజరాత్ లో బడ్జెట్ కన్నా అప్పే ఎక్కువగా ఉంది . కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్ణాటక లోనూ అప్పు అక్కడి బడ్జెట్ కంటే ఎక్కువ. ఇవన్నీ మరిచి కాంగ్రెస్ నేతలు భావదారిద్య్రం తో కంటగింపు తో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఈ దుగ్ధ?” అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తలసరి ఆదాయంలో తెలంగాణా దేశం లో టాప్ టెన్ లో ఉందని తెలిపారు. భవిష్యత్ లో ఉనికి కోల్పోతామని కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా వీటన్నింటిపై సవివరంగా సమాధానం చెబుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ దివాళాకోరు రాజకీయాలను ప్రజలు నమ్మొద్దని కోరారు. తెలంగాణా ఉదయ్ బాండ్లు ముంబయి లో హాట్ కేకుల్లాగా అమ్ముడు పోయాయని, ఇది తెలంగాణా ప్రగతి కి నిదర్శనమని తెలిపారు. జీహెచ్ఎంసీకి పారిశ్రామిక అభివృద్ధికి అధికంగా నిధులు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు, మంత్రి ఈటలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్ నేతలకు పవర్ హాలిడే ఇచ్చారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అందుకే జనావేదన సభల పేరుతో అధికార విరహా వేదన సభలు కాంగ్రెస్ నేతలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. నయాపైసా తో సహా అప్పు తీరుస్తామని తెలిపారు. రాష్ట్రానికి నిధులిచ్చే విషయం లో కేంద్రం మెహర్భానీ చేయడం లేదని తెలిపారు. రాష్రాలు లేకుంటే కేంద్రం ఎక్కడ ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశ్నించారు. అంతిమంగా తీర్పు ఇచ్చేది ప్రజలేనని చెప్పారు. అవినీతి-స్కాం ల గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడడం చండాలంగా ఉందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ అంటూ మండిపడ్డారు. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడటమా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ లో అందరికీ అల్ ది బెస్ట్ అని చెప్తూ ప్రజలు ఎవరికీ తీర్పు ఇస్తే వాళ్ళే విజేతలు అవుతారని కేటీఆర్ చమత్కరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/