Begin typing your search above and press return to search.

తుమ్మ‌ల కోసం కేటీఆర్ స‌వాల్‌

By:  Tupaki Desk   |   8 May 2016 10:10 PM IST
తుమ్మ‌ల కోసం కేటీఆర్ స‌వాల్‌
X
పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో గులాబీ గెలుపును భుజ‌నా వేసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కొత్త స‌వాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించిన అనంత‌రం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ స‌వాల్ విసిరారు.

రాష్ట్రంలో జరిగే ప్రతీ ఎన్నికల్లో చెప్పేందుకు కాంగ్రెస్ నాయకులు కుంటిసాకులు వెతుక్కుంటున్నారని మండిపడ్డారు. పాలేరు ఎన్నిక‌ల్లో సానుభూతిని అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ నేతలు అరాచాకాలు చేస్తున్నారని కేటీఆర్‌ మర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలకు ప్రింటర్లు అమర్చేందుకు సిద్దమని ఎన్నిక‌ల క‌మిష‌న్ చెప్పినప్ప‌టికీ కాంగ్రెస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాద‌ని కేటీఆర్ అన్నారు. ఒకవేళ పాలేరులో టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్‌ రావు ఓడిపోతే తాను నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవిని సైతం వదులుకోవడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. అదే సమయంలో పాలేరులో కాంగ్రెస్ ఓడిపోతే నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా? అని కేటీఆర్‌ సవాలు చేశారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని తాము ప్రజలనుకోరుతున్నామని వివరించారు. టీఆర్‌ఎస్ విజ‌యం కోసం కృషిచేస్తున్న కేటీఆర్ స‌వాల్ ఇపుడు రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.