Begin typing your search above and press return to search.

తన్ని తగలేస్తాం అంటున్న కేటీఆర్

By:  Tupaki Desk   |   20 Oct 2015 9:52 AM IST
తన్ని తగలేస్తాం అంటున్న కేటీఆర్
X
పులికడుపున పిల్లి పుడుతుందా అనేది చాలా పాత సామెత అయిందిప్పుడు. కేసీఆర్ కడుపున కేటీఆరే పుడతాడు అనేది నేటి సామెత. దీన్ని అక్షరాలా కొత్తగా నిరూపిస్తూ తెలంగాణ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ సోమవారం మళ్లీ బీపీ పెంచుకున్నారు. అచ్చోసిన కేసీఆర్‌ ని తలపిస్తూ తెలంగాణలోని రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు గుప్పించడం ఇలాగే కొనసాగించినట్లయితే, వాటిని తన్ని తగలేస్తామని హెచ్చరించారు.

ప్రతిష్ఠాత్మకమైన వాటర్ గ్రిడ్ కార్యక్రమంలో ఎక్కడైనా చిన్న అవినీతి జరిగినట్లు ప్రతిపక్ష నేతలు నిరూపిస్తే ఆ మరుక్షణం తాను రాజకీయాల్లోంచి వైదొలుగుతానని కేటీఆర్ తెలంగాణ ప్రతిపక్ష నేతలకు సవాలు విసిరారు. ఒకవైపు ప్రభుత్వం అవినీతి, అవకతవకలకు పాల్పడుతోందని తీవ్రమైన ఆరోపణలు చేస్తూ మరోపైవు ప్రభుత్వం నుంచి గౌరవం ఆశించడం ఏమిటంటూ కేటీఆర్ ప్రతిపక్షాన్ని అవహేళన చేశారు. వారు మమ్మల్ని గౌరవిస్తే మేము వారినీ గౌరవిస్తాం. లేకుంటే వారిని తన్ని తగలేస్తాం అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ హయాంలో రైతుల బాధలను ఏమాత్రం పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసమే రైతు భరోసా యాత్రలు చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. మూడేళ్లలో తెలంగాణ ప్రజలందరికీ తాగునీటి సరఫరాను కల్పించకపోతే తాము తదుపరి ఎన్నికల్లో ఓట్లు అడగబోమని కేటీఆర్ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ గత 60 ఏళ్లలో సాధించలేని ప్రాజెక్టులను తమ ప్రభుత్వం 60 నెలల్లో పూర్తి చేస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ సవాళ్లూ, ప్రతిసవాళ్లూ, ఆగ్రహ ప్రకటనలూ అలా పక్కన ఉంచితే మాటకు మాట బదులివ్వడంలో కేటీఆర్ తన తండ్రితో పోటీపడుతున్నట్లే ఉంది. అవినీతి ఆరోపణలు చేసినంత మాత్రాన తన్నితగలేస్తామని ఎవరైనా అనడానికి సాహసించగలరా.. ఒక్క కేసీఆర్, కేటీఆర్ తప్ప.