Begin typing your search above and press return to search.

కటౌల్లు.. ఫ్లెక్సీలు కనిపించాయ్ కేటీఆర్

By:  Tupaki Desk   |   25 July 2016 11:46 AM IST
కటౌల్లు.. ఫ్లెక్సీలు కనిపించాయ్ కేటీఆర్
X
ఇటీవల కాలంలో హైదరాబాద్ లోని రోడ్లు.. డ్రైనేజీ.. తాగునీరు లాంటి మౌలికసదుపాయాల మీద దృష్టి సారించిన మంత్రి కేటీఆర్.. తరచూ అధికారులతో సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ రూపురేఖల్ని మార్చేందుకు ఆయన విపరీతంగా శ్రమిస్తున్నారు. పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా సర్ ప్రైజ్ విజిట్స్ తో జీహెచ్ ఎంసీ అధికారుల్లో వణుకు పుట్టిస్తున్నారు. ఏ నిమిషాన ఆయన ఎక్కడ ఉంటారో? ఎక్కడ నుంచి ఫోన్ చేస్తారో? తెలీక టెన్షన్ పడుతున్న వాతావరణం ఇప్పుడిప్పుడే మొదలైంది.

నిన్న మొన్నటి వరకూ థిలాసాగా కనిపించిన అధికారులు కేటీఆర్ సీరియస్ నెస్ చూసి అలెర్ట్ అయిపోతున్నారు. కేటీఆర్ ఓపిక నశించిందని.. చర్యల వేటు వేసేందుకు ఆయన కత్తులు సిద్ధం చేస్తున్నారన్న సమాచారం అధికారుల మత్తు వదిలిస్తోంది. ఇదిలా ఉంటే.. మొన్నటికి మొన్న నగరంలో ఏర్పాటు చేసే అక్రమ హోర్డింగ్ లు.. ఫ్లెక్సీల గురించి కేటీఆర్ మండిపడ్డారు.

అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేసే వాటిని తొలగించాలని.. ఎంత పెద్ద నాయకులదైనా చర్యలు తీసుకోవాలని వెనక్కి తగ్గకూడదన్నారు. ఈ సందర్భంగా తన బర్త్ డే సందర్భంగా ఎవరూ ఫ్లెక్సీలు.. బ్యానర్లు ఏర్పాటు చేయకూడదని.. ఒకవేళ అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తే వాటిని సైతం తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కేటీఆర్ నోటి నుంచే స్వయంగా మాట వచ్చిన నేపథ్యంలో.. ఆదివారం ఆయన బర్త్ డే సందర్భంగా ఫ్లెక్సీలు.. హోర్డింగ్ ల జోరుకు కళ్లెం పడుతుందని పలువురు ఆశించారు.

అయితే.. ఎప్పటి మాదిరి కాకున్నా.. ఎంతోకొంత స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం కనిపించింది. తన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు.. హోర్డింగ్ లు ఏర్పాటు చేయొద్దని కేటీఆర్ చెప్పినా.. ఆయన మాటలు.. ఆయన్ను అభిమానించే అభిమానం ముందు పని చేయలేదనే చెప్పాలి. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీల జోరు లేనట్లు కనిపించినా.. శివారుల్లో మాత్రం ఓ రేంజ్లో కనిపించాయి. మొత్తానికి కేటీఆర్ చెప్పిన మాటల్ని అధికారులే కాదు ఫాలోయర్లు కూడా వినటం లేదనే అనుకోవాలి.