Begin typing your search above and press return to search.

కేటీఆర్ ముఖ్య‌మంత్రి అవుతారా?

By:  Tupaki Desk   |   11 Dec 2018 10:10 AM IST
కేటీఆర్ ముఖ్య‌మంత్రి అవుతారా?
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఇప్ప‌టికే స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ ఎస్ ఫుల్ జోష్ లో ఉంది. మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాలకుగాను టీఆర్ ఎస్ 89 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జా కూట‌మి కేవ‌లం 16 సీట్ల‌లో ముందంజ‌లో ఉంది.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌టం ఖాయ‌మ‌ని తేలిపోయింది! దీంతో సీఎం పీఠాన్ని ఎవ‌రు అధిష్ఠించ‌బోతున్నార‌నే అంశంపై ప్ర‌స్తుతం అంత‌టా చ‌ర్చ జ‌రుగుతోంది. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని త‌న కుమారుడు కేటీఆర్‌ కు అప్ప‌గించోతున్నార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ‌లో ఏ పార్టీ ఆధిక్యంలో నిలిచినా.. ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారం బుధ‌వార‌మే ఉంటుంద‌ని ఇప్ప‌టికే వార్త‌లొచ్చాయి. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌న్న త‌న మ‌నోవాంఛ‌ను కేసీఆర్ ఇప్ప‌టికే ప‌లుమార్లు బ‌హిరంగంగా వెల్ల‌డించారు. ఆ దిశ‌గా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో కుమారుడు కేటీఆర్ కు తెలంగాణ సీఎం పీఠాన్ని అప్ప‌గించి కేసీఆర్ ఇక పూర్తిగా జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టిసారించ‌వ‌చ్చున‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

గ‌త నాలుగున్న‌రేళ్ల‌లో మంత్రిగా మంచి గుర్తింపు తెచ్చుకోవ‌డం కూడా కేటీఆర్ కు క‌లిసొస్తుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. మంత్రిగా ఆయ‌న ఇప్ప‌టికే నిరూపించుకోవడంతో ఇక కేసీఆర్ ఆయ‌న‌కు సీఎం పీఠం అప్ప‌గించి నిబ్బ‌రంగా ఉండొచ్చ‌ని సూచిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుండ‌టం లేద‌న్న వార్త‌లు కూడా ఆయ‌న ఈసారి సీఎంగా ఉండ‌క‌పోవ‌చ్చున‌నే ఊహాగానాల‌ను బ‌ల‌ప‌రుస్తున్నాయి.

అయితే - టీఆర్ ఎస్ అధికారంలోకి వ‌స్తే మ‌ళ్లీ కేసీఆరే ముఖ్య‌మంత్రి అవుతార‌ని కేటీఆర్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇప్పుడు తాను సీఎం అయితే ఇచ్చిన మాట త‌ప్పిన‌ట్లు అవుతుంద‌ని ఆయ‌న భావించే అవ‌కాశ‌ముంది. కాబట్టి ప్ర‌స్తుతానికి కేసీఆరే సీఎం అవుతార‌ని తెలుస్తోంది. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కు ఆ పీఠాన్ని కుమారుడికి గులాబీ ద‌ళ‌ప‌తి అప్ప‌గించే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.