Begin typing your search above and press return to search.

ల‌క్షా 25 వేల ఉద్యోగాల‌కు కేటీఆర్ కొత్త ప్లాన్‌

By:  Tupaki Desk   |   3 Jan 2018 11:28 PM IST
ల‌క్షా 25 వేల ఉద్యోగాల‌కు కేటీఆర్ కొత్త ప్లాన్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ 2018కి కొత్త టార్గెట్ పెట్టుకున్నార‌ని ఆయ‌న సన్నిహిత వ‌ర్గాలు అంటున్నారు. లక్షా 25వేల ఐటీ - ఐటీ అనుబంధ కొత్త ఉద్యోగాలు క‌ల్పించ‌డ‌మే కేటీఆర్ ల‌క్ష్య‌మ‌ని చెప్తున్నాయి. ఇందుకు నిద‌ర్శ‌నంగా తాజాగా ఆయ‌న సిద్ధం చేసుకున్న బృహ‌త్ ప్ర‌ణాళిక అని వివిర‌స్తున్నారు. మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో ఐటీ పరిశ్రమలను నగరంలోని నలుమూలలకు విస్తరించాలన్న దీర్ఘకాలిక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ముందుకు పోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌ లోని బుద్వేల్ - రాజేంద్రనగర్ లో మంత్రి కేటీఆర్ ఇవాళ పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేయనున్న ఐటీ క్లస్టర్(ఐటీ పార్క్) స్థలాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బుద్వేల్‌ లో మొత్తం 350 ఎకరాల్లో ఐటీ పార్క్ నిర్మించనున్నామన్నారు. బుద్వేల్ ఐటీ క్లస్టర్ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నదని స్పష్టం చేశారు. ఐటీ క్లస్టర్‌ కు త్వరలోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారన్నారు. ఈ క్లస్టర్‌ లో కంపెనీలను స్థాపించేందుకు ఇప్పటికే 30కి పైగా సంస్థలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయన్నారు. ఇందులో ఐటీ పరిశ్రమలోనే పేరున్న దేశీయ కంపెనీలతో పాటు అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కంపెనీల స్థాపన పూర్తయితే 1.25 లక్షల ఉద్యోగాలు రానున్నట్లు మంత్రి ప్రకటించారు.

ఐటీ క్లస్టర్‌ లో రానున్న 5 ఏండ్లలో కంపెనీలు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నూతనంగా ఏర్పాటు కానున్న ఈ క్లస్టర్ లో అన్ని మౌళిక సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని టీఎస్ ఐఐసి అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి అత్యుత్తమ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలన్నారు. ప్రస్తుతం రాజేంద్రనగర్ లో ఉన్న కార్యకలాపాలు లేని పలు ప్రభుత్వ సంస్ధలు తమ భూములను పరిశ్రమలకు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వాటి భూ యాజమాన్య మార్పులను త్వరలోనే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ క్లస్టర్ పనులను వేగవంతం చేసేందుకు ఐటి శాఖ - రెవెన్యూ శాఖ - రంగారెడ్డి జిల్లా కలెక్టర్ - టీఎస్ ఐఐసి లతో కలిపి ఒక సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించనున్నారని మంత్రి చెప్పారు.