Begin typing your search above and press return to search.

కేసీఆర్ పరువు స‌మ‌స్య‌..రంగంలోకి కేటీఆర్‌

By:  Tupaki Desk   |   6 Feb 2018 4:57 AM GMT
కేసీఆర్ పరువు స‌మ‌స్య‌..రంగంలోకి కేటీఆర్‌
X
భారీ ఆలోచ‌న‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌...అవి కాస్త బెడిసికొట్టినప్పుడు అదే స్థాయిలో యూ టర్న్ తీసుకునేందుకు ఏ మాత్రం సంకోచించ‌కుండా ఉంటార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు విశ్లేషించే టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ - తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు ప‌రువు స‌మ‌స్య ఎదురైంది. `మాట ఇస్తే..త‌ల న‌రుక్కొని అయినా...అమ‌లు చేస్తా` అని ప్ర‌క‌టించే కేసీఆర్‌ కు అలా ఇచ్చిన మాటే ఇర‌కాటంలో పడేసింది. దీంతో త‌న తండ్రి ప‌రువు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు త‌న‌యుడైన మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ఇదంతా డ‌బుల్ బెడ్రూం ఇళ్ల‌ గురించి.

తెలంగాణ రాష్ట్రస‌మితి అధినేత కేసీఆర్ 2014 ఎన్నిక‌ల్లో ఇచ్చిన కీల‌క‌మైన హామీల‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ఒక‌టి. పేద‌వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు గౌర‌వంగా బ‌తికేందుకు ఉండాల్సింది డబ్బాల‌వంటి ఇండ్లు కాద‌ని...డబుల్ ఇండ్లు కావాల‌ని ముఖ్య‌మంత్రి హోదాలో కేసీఆర్ ఎన్నో ద‌ఫాలుగా సెల‌విచ్చారు. అయితే...ఆ ఇండ్ల నిర్మాణం అనుకున్నంత వేగంగా కాదుక‌దా...అర్హుల్లో కొంద‌రికీ కూడా ద‌క్క‌లేదు. దీంతో పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇండ్ల నిర్మాణం విష‌యంలో విప‌క్షాలు ఎదురుదాడి మొదలుపెట్టాయి. డబుల్ ఇండ్ల జాప్యానికి అనేకానేక కార‌ణాలు ఉన్నాయి. మ‌రోవైపు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో స‌ర్కారులో టెన్ష‌న్ మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో స‌మ‌స్య‌ల‌ను అన్వేషించింది. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి మార్కెట్‌ లో స్టీల్ ధర పెరిగిపోవడంతో ప్రధాన సమస్యగా మారిందని తేలింది. దీనివల్ల డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లకు ప్రభుత్వం ఖరారు చేసిన నిధులు చాలని పరిస్థితి తలెత్తింది. గతంలో ఇలాంటి సమస్యే సిమెంట్ ధరల విషయంలోనూ ప్రభుత్వం ఎదుర్కొంది.

ఈ నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ త‌న తండ్రి ఇచ్చిన మాట‌ను, త‌మ స‌ర్కారు ప్ర‌తిష్ట‌ను కాపాడేందుకు రంగంలోకి దిగారు. గ‌తంలో అమ‌లు చేసిన థియ‌రీనే ఫాలో అయ్యారు. అప్పట్లో సిమెంట్ సరఫరా చేసే డీలర్లు - కంపెనీలతో ప్రభుత్వం చర్చించి మార్కెట్ ధరలతో ప్రమేయం లేకుండా ధరలను ఖరారు చేసింది. స్టీల్ ధరల విషయంలో కూడా అదే విధమైన చర్యలను చేపట్టారు. స్టీల్ సరఫరా చేసే డీలర్లతో సచివాలయంలో మంత్రి కె తారకరామారావు - గృహ నిర్మాణ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి చర్చలు జరిపారు. గతంలో కూడా సిమెంట్ డీలర్లు - కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేసి సిమెంట్ ధరలను ఖరారు చేసిన విషయాన్ని స్టీల్ డీలర్లకు మంత్రులు వివరించారు. మార్కెట్‌లో సిమెంట్ ధరల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా సిమెంట్ బస్తా ధర రూ.230గా ఖరారు చేసినట్టు వివరించారు. అదే మాదిరిగా డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లకు సరఫరా చేసే స్టీల్ ధరలపై ఒక అవగాహనకు రావాల్సిందిగా డీలర్లకు మంత్రులు సూచించారు. ఈ పథకానికి పెద్ద ఎత్తున స్టీల్ అవసరం ఉండటంతో బహిరంగ మార్కెట్ కంటే తక్కువకు సరఫరా చేయడం వల్ల డీలర్లకు నష్టం ఉండదని మంత్రులు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే లక్ష ఇళ్ల నిర్మాణానికి 1.45 లక్షల మెట్రిక్ టన్నులు - పట్టణ ప్రాంతాల్లో నిర్మించే 60 వేల ఇళ్లకు 1.04 లక్షల మెట్రిక్ టన్నులు - గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మించే లక్ష ఇళ్లకు 2.78 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ అవసరమని డీలర్లకు వివరించారు. మొత్తంగా 5.27 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ అవసరమని వివరించారు. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి స్టీల్ అవసరం ఉండటంతో రాష్టవ్య్రాప్తంగా ఒకే ధరకు సరఫరా చేయాలని మంత్రులు సూచించారు. ప్రభుత్వానికి సరఫరా చేసే స్టీల్‌ కు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం ఉండదని కూడా మంత్రులు స్పష్టం చేసారు. స్టీల్‌ ను సరఫరా చేసిన వెంటనే ఆన్‌ లైన్ ద్వారా డీలర్ల ఖాతాలకు డబ్బులు చెల్లించనున్నట్టు కూడా మంత్రులు వివరించారు. డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లకు సరఫరా చేసే స్టీల్‌ ను వ్యాపారంగా చూడకుండా నిరుపేదలకు ప్రభుత్వం నిర్మించి ఇస్తుండటంతో సామాజిక బాధ్యతగా చూడాలని డీలర్లకు మంత్రులు సూచించారు.

ఇలా త‌మ అవ‌స‌రాన్ని - సామాజిక బాధ్య‌త‌ను - వ్యాపారుల్లో భ‌రోసాను నింపుతూ కేటీఆర్ ప్ర‌య‌త్నం చేశారు. తండ్రి ప‌రువు అంశాన్ని కాపాడేందుకు త‌న‌యుడు చేసిన ప్ర‌య‌త్నం ఏ మేర‌కు స‌ఫ‌లం అవుతుందో చూడాలి మ‌రి.