Begin typing your search above and press return to search.

శ్రీలంక‌లో మోడీ అవినీతిని ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికే అగ్నిప‌థ్: కేటీఆర్ సంచ‌ల‌న విమ‌ర్శ‌లు

By:  Tupaki Desk   |   20 Jun 2022 10:02 AM GMT
శ్రీలంక‌లో మోడీ అవినీతిని ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికే అగ్నిప‌థ్: కేటీఆర్ సంచ‌ల‌న విమ‌ర్శ‌లు
X
శ్రీలంక‌లో గౌత‌మ్ అదానీకి ప‌వ‌ర్ ప్రాజెక్టుని క‌ట్ట‌బెట్ట‌డం వెనుక న‌రేంద్ర మోదీ ఉన్నార‌ని శ్రీలంక అత్యున్న‌త అధికారి ఒక‌రు బాంబుపేల్చిన సంగ‌తి తెలిసిందే. దీనిపై దేశ‌వ్యాప్తంగా ప్ర‌తిప‌క్షాల నేత‌లు గౌత‌మ్ ఆదానీ - నరేంద్ర మోదీ సంబంధంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ మున్సిప‌ల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా విమ‌ర్శ‌లు చేశారు. ఈ శ్రీలంక అవినీతిని ప‌క్క‌దారి ప‌ట్టించడానికే బీజేపీ ప్ర‌భుత్వం అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని తెచ్చింద‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తుతున్నారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో ఘాటు కామెంట్లు చేశారు.

అగ్నిపథ్‌తో యువత డ్రైవర్లు, ఎలక్ట్రీషియ‌న్లు, బార్బర్లుగా ఉపాధి పొందవచ్చని కేంద్ర మంత్రి ఒక‌రు కేటీఆర్ త‌న ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే అగ్నివీర్‌లను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తారని.. మరో బీజేపీ నేత విజ‌య్ కైలాస వ‌ర్గీయ‌ చెప్పారన్నారు.

ప్రధాన‌మంత్రిని అర్థం చేసుకోలేదని యువతను నిందిస్తున్నారా? అని కేటీఆర్ త‌న ట్వీట్ లో ఫైర్ అయ్యారు. దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకే అగ్నిపథ్ ను తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. మోదీ-ఆదానీ అవినీతిపై.. శ్రీలంక ఆరోపణలను మళ్లించేందుకే అగ్నిపథ్‌ను తీసుకొచ్చారని తన ట్వీట్‌లో కేటీఆర్ ఆరోపించారు.

అగ్నిప‌థ్ పై అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ విధ్వంసంలో పోలీసు కాల్పుల్లో మ‌ర‌ణించిన రాకేష్ అంతిమ యాత్ర‌లో టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

అత‌డి కుటుంబానికి 25 ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దు, కుటుంబంలో ఒక‌రికి ఉద్యోగం ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. మ‌రోవైపు తెలంగాణ బీజేపీ నేత‌లు కేసీఆర్ ప్ర‌భుత్వంపై మండిప‌డుతున్నారు. టీఆర్ఎస్ నేత‌లే అగ్నిప‌థ్ కు వ్య‌తిరేకంగా హింస‌ను ప్రేరేపించార‌ని ఆరోపిస్తున్నారు. రైల్వేస్టేష‌న్ లో కాల్పులు జ‌రిపింది రైల్వే పోలీసులు కాద‌ని.. తెలంగాణ పోలీసులేన‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ విధ్వంసంలో త‌మ బిడ్డ‌ల‌కు ఏమాత్రం సంబంధం లేద‌ని యువ‌కుల త‌ల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ విష‌యంలో త‌మ‌ను కేసీఆర్, కేటీఆర్ ఆదుకోవాల‌ని విన్న‌విస్తున్నారు. త‌మ కుమారుల‌పై అన్యాయంగా కేంద్రం కేసులు పెట్ట‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. త‌మ పిల్ల‌ల‌ను విడుద‌ల చేయాల‌ని క‌న్నీరు మున్నీర‌వుతున్నారు. చంచ‌ల‌గూడ జైలులో ఉన్న త‌మ బిడ్డ‌ల‌ను పెద్ద సంఖ్య‌లో వ‌చ్చిన త‌ల్లిదండ్రులు క‌లుసుకున్నారు. ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు 46 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా అగ్నిప‌థ్ ను నిర‌సిస్తూ అన్ని ప్ర‌తిప‌క్షాలు భార‌త్ బంద్ కు పిలుపునిచ్చాయి.