Begin typing your search above and press return to search.

కృష్ణమ్మా.. నీ సంగతేంటమ్మా!?

By:  Tupaki Desk   |   9 July 2015 5:30 PM GMT
కృష్ణమ్మా.. నీ సంగతేంటమ్మా!?
X
నవ్యాంధ్ర రాజధాని సర్వే పూర్తయింది! మరొక సర్వే కొనసాగుతోంది! సీఆర్‌డీఏ సర్వే పూర్తయింది! ఇప్పుడు కృష్ణా నది సర్వే మొదలుకానుంది! ఇంతకీ, కృష్ణా నదిని సర్వే చేయడం ఎందుకు!? అనే సందేహం ఎవరికైనా వస్తుంది. కానీ, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో కృష్ణా నది అత్యంత కీలక పాత్ర పోషించనుంది. నదిని ఆధారంగా చేసుకుని పలు నిర్మాణాలు చేపట్టనున్నారు. అందుకే ఇప్పుడు నవ్యాంధ్ర రాజధానికి జీవనాడి వంటి కృష్ణమ్మను సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతాన్ని కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు నేరుగా మార్గాన్ని ఏర్పాటు చేస్తూ రెండు మూడు వంతెనలను ఏర్పాటు చేయాలని సింగపూర్‌ మాస్టర్‌ ప్లాన్‌లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు. ఇక, ఒక వంతెనపై నది మధ్యలో అయితే నిలువెత్తు భారీ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. దీనికితోడు, నదికి ఇరువైపులా వాటర్‌ స్పోర్ట్స్‌తో నదిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నారు. ఇవన్నీ చేయాలంటే నదికి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉండాలి కదా! అందుకే సర్వే చేయాలని నిర్ణయించారు.

అమరావతి నుంచి ప్రకాశం బ్యారేజీ మధ్య వివిధ ప్రాంతాల్లో కృష్ణా నది లోతు ఎంత? వెడల్పు ఎంత;? నీటి నిల్వ సామర్థ్యం ఎంత? వరదలు వస్తే ప్రభావితమయ్యే ప్రాంతాలు ఏవి? మునిగిపోయే ప్రాంతాలు ఏవి? మునక ఎంతకాలం ఉంటుంది? లంకలు.. వాటిల్లోని భూములు.. అక్కడ పంటే పంటలు.. ఇసుక రీచ్‌లు.. కరకట్టలు.. పర్యాటనానికి అనుకులంగా ఉండే ప్రదేశాలు.. తదితర వివరాలన్నిటినీ సేకరించేలా సమగ్ర సర్వే చేయాలని సర్కారు నిర్ణయించింది. రాజధాని నిర్మాణంలో భాగంగా ఇప్పుడు కృష్ణా నది వివరాలు కూడా బయటకు రానున్నాయి.