Begin typing your search above and press return to search.

కొత్త ప్రాజెక్టుల డిపీఆర్ లు సమర్పించాల్సిందే...రెండు రాష్ట్రాలకి కృష్ణా బోర్డు ఆదేశాలు

By:  Tupaki Desk   |   5 Jun 2020 8:30 AM GMT
కొత్త ప్రాజెక్టుల డిపీఆర్ లు సమర్పించాల్సిందే...రెండు రాష్ట్రాలకి కృష్ణా బోర్డు ఆదేశాలు
X
హైదరాబాద్ లోని జలసౌధలో జరిగిన కృష్ణా నదీపరివాహక బోర్డు సమావేశం గురువారం సుధీర్గంగా సాగింది. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులకు సంబందించిన వివరాలు ఎట్టి పరిస్థితిలో సమర్పించాల్సిందేనని కృష్ణ బోర్డ్ రెండు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. కృష్ణా నదిపై రెండు తెలుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న పోటా పోటీ ప్రాజెక్టులపై పరస్పర ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో సమస్యను పరిష్కరించే దిశగా కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశమైంది. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి.

ఈ సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డ్ కీలక సూచనలు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలు వాడుకోవాలని రెండు రాష్ట్రాల ప్రతినిధులకు కృష్ణా నది యాజమాన్య బోర్డు సూచించింది. ఇక నదిపై నిర్మస్తున్న కొత్త ప్రాజెక్టులకు సంబంధించి డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టులు కూడా విధిగా బోర్డుకు సమర్పించాలని సూచించింది. కాగా రెండో దశ టెలిమెట్రీని ప్రాధాన్యతా అంశంగా పరిగణించి అమలు చేసేందుకు రెండు ప్రభుత్వాలు ఆమోదయోగ్యంగా ఉన్నట్టు బోర్డ్ స్పష్టం చేసింది.

ఇక, అలాగే శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రం నుంచి 50:50 నిష్పత్తిలో విద్యుత్‌ పంపకానికి రెండు రాష్ట్రాల ప్రతినిధులు అంగీకరించినట్లు తెలుస్తోంది. తాగునీటి వినియోగాన్ని 20 శాతమే లెక్కించాలనే దానిపై ఇరు రాష్ట్రాలు అంగీకరించలేదని తెలుస్తోంది. ఏపీలోని గోదావరి నుంచి కృష్ణా బేసిన్ కు తరలిస్తున్నందున తెలంగాణకు అదనంగా నీటిని కేటాయించాలని డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో ఈ అంశంపై జలశక్తి శాఖకు ఇప్పటికే నివేదించినట్లు బోర్డు వివరణ ఇస్తోంది. ఇదే అంశం పై ఇరు రాష్ట్రాలు తగిన స్పష్టతతో ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో అంతగా సమస్య తలెత్తే అవకాశం ఉండబోదని బోర్డ్ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా కృష్ణ నదీ యాజమాన్య బోర్డ్ ముందు ఏపీ ప్రతినిధులు ఈ విధమైన వాదనలు వినిపించారు. శ్రీశైలంలో 800 అడుగుల్లో నుంచి నీటిని తీసుకొని రాయలసీమ, నెల్లూరు జిల్లాల అవసరాలు తీర్చేందుకు పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను చేపట్టామని వివరించారు. రాష్ట్రానికి ఉన్న 511 టీఎంసీల వాటాల్లోంచే నీటిని వినియోగించుకుంటాం తప్ప అదనంగా చుక్కనీరు తోడేది లేదని స్పష్టం చేసారు. పాలమూరు ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో వాటినే చేపట్టేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలు తేల్చేందుకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. జూరాల ప్రాజెక్టు జల విస్తరణ ప్రాంతం నుంచి నీటిని తరలించేలా సాధ్యాసాధ్యాల నివేదికకు అనుమతిస్తే, తెలంగాణ దాన్ని శ్రీశైలం నుంచి 90 టీఎంసీలు తరలించేలా చేపట్టింది. రాష్ట్ర విభజన తర్వాతే తెలంగాణ దాన్ని చేపట్టింది. కావున అది ముమ్మాటికీ కొత్త ప్రాజెక్టుగానే పరిగణించాలి ఏపీ బృందం వాదించింది.

కాగా తెలంగాణ ప్రతినిధుల వాదనలను ఈ రకంగా ఉన్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ ద్వారా తాగునీటికి తమకు 3.5 టీఎంసీలు సరిపోతాయని బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ ముందు వేసిన అఫిడవిట్‌లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొందని, కాబట్టి ప్రస్తుతం దాని సామర్థ్యాన్ని ఇంతలా పెంచాల్సిన అవసరం లేదని తెలంగాణ బృందం తేల్చి చెప్పింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల ప్రాజెక్టు పూర్తిగా పాతవే. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ తయారు చేయాలని 2013 ఆగస్టులోనే అప్పటి ప్రభుత్వం జీవో-72 ఇచ్చిందని గుర్తు చేసారు. డిండి ప్రాజెక్టును 2007 జూలైలోనే జీవో-159 ఇచ్చారు. ఇది ముమ్మాటికీ పాత ప్రాజెక్టేనని తెలంగాణ వాదించింది.