Begin typing your search above and press return to search.

వీళ్లంతా ముఖప్రీతికి మునుగుతున్నారా?

By:  Tupaki Desk   |   22 Aug 2016 10:30 PM GMT
వీళ్లంతా ముఖప్రీతికి మునుగుతున్నారా?
X
మన గవర్నర్ గారికి రెండు సార్లు పుష్కర స్నానాలు తప్పదు. ఎందుకంటే ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకి ప్రధమ పౌరుడు కాబట్టి. మరి కొందరు మఖ్యులు రెండు సార్లు స్నానాలెందుకు చేస్తున్నట్టు? ఇదే ఇప్పుడు పుష్కర పుణ్యస్నానాలు ఆచరిస్తున్న లక్షల మంది ప్రజల్లో మెదలుతున్న ప్రశ్న. సినీ - వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు అటు తెలంగాణలోని ఘాట్లలో ఒకరోజు - ఏపీ బెజవాడలో ఒకరోజు మునుగుతున్నారు. అయితే రెండు ప్రభుత్వాల నుంచి వీవీఐపీ ఆహ్వానాలు అందాయి గనుక రెండు చోట్లా మునగడమే తప్ప.. అది భక్తితో చేస్తున్న పనిలా లేదని పలువురు అంటుండడం విశేషం.

ఎందుకంటే సంవత్సరానికి ఒక నదిలో వుండే పుష్కరుడు వున్నప్పుడు మొదటి పన్నెండు రోజులలో స్నానమాచరిస్తే పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని నమ్మకం. పుష్కర స్నానమంటే తల మునిగేటట్టు మూడు మునకలు వేస్తే చాలు. తర్వాత తర్పణాలు - కొందరు పిండప్రదానాలు వాళ్ళ అవసరాన్నీ బట్టి ఆచారాన్నిఅమలు పరుస్తారు. ప్రస్తుతం ఈ పుష్కర స్నానం కృష్ణానది ఎక్కడేక్కడ ప్రవహిస్తుందో అక్కడంతా చేయెచ్చు. అంతే గాని రాష్ట్ర ప్రభుత్వాలు టముకు కొట్టి అమ్యూజ్ మెంట్ పార్కులకి జనాలని పిలిచినట్టు ఫలాన ప్రదేశాలలో చేయాలనేం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు చేసే హంగామాలో పవిత్రత కన్నా పబ్లిసిటీ ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యులకి పుష్కర స్నానానికి రండని ఆహ్వాన పత్రాలు అందచేయడం అర్ధంలేనిది అందునా అవి మంత్రులు పంచడం విడ్డూరం.

ప్రచారమైకం లో పడిపోయిన ప్రజలు పవిత్ర స్నానానికి వెళ్లినట్టుగా కాకుండా వాటర్ పార్క్ కి సరదాగా వెళ్లినట్టుగా వుంటున్నారు. అక్కడ షవర్ల ఏర్పాట్లు చూస్తే అలాగే అనిపిస్తుంది. కొందరు ఆ రాష్ట్రంలో ఒక సారి ఇంకో చోట మరోసారి స్నానాలు చేస్తున్నారు ఎక్కువ పుణ్యం సంపాదించుకుందామని. అయితే సంప్రదాయ బద్దంగా పవిత్రత తోటి స్నానమాచరించిన వాళ్ళు లేకపోలేదు. అలాంటి వాళ్ళు ఈ హంగులు ఆర్భాటాలు పట్టించుకోకుండా భక్తితో మూడు మునకలు వేసి వెనక్కి వచ్చేస్తున్నారు.

సెలబ్రెటిలైతే ఫోటోలకి ఫోజులు. సరే సెలబ్రేటిలు కదా అలాంటివి తప్పవనుకుంటే ఆ రాష్ట్రంలో ఒకసారి ఈ రాష్ట్రంలో ఇంకోసారి పుష్కరస్నానం. రెండు చోట్ల ఎందుకయ్యా అంటే రెండు ప్రభుత్వాల దగ్గర నుండి ఆహ్వానాలు అందాయని తెలుస్తోంది. ఆహ్వానాలు వచ్చాయి గనుక.. స్నానాలు చేస్తున్నట్లుగా ఉందే తప్ప.. ఆధ్యాత్మిక విశ్వాసంతో చేస్తున్నట్లుగా లేదని పలు విమర్శలు వస్తున్నాయి. పుష్కర స్నానం అంటే ఒకచోట చేస్తే సరిపోతుందని తెలిసినప్పటికీ.. ఏ ప్రభుత్వం ఏం కినుక వహిస్తుందో తమ ప్రయోజనాలు ఎలా దెబ్బతింటాయోననే భయంతో ఇలా చేస్తున్నారని అనుకోవాల్సి వస్తోంది.