Begin typing your search above and press return to search.

అనంతపురంలోనూ కృష్ణా పుష్కరాలు

By:  Tupaki Desk   |   12 Aug 2016 10:04 AM GMT
అనంతపురంలోనూ కృష్ణా పుష్కరాలు
X
కృష్ణా పుష్కరాల సందడి తెలుగు రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ కృష్ణానది పరీవాహక ప్రాంతమంతా భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే.. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో లేని అనంతపురంలోనూ పుష్కరాల సందడి కనిపిస్తోంది. ప్రజలు పవిత్ర కృష్ణానది నీటిలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా... అంతా హంద్రీనీవా మహిమ. అవును.. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నీరు రావడంతో ప్రజలు అక్కడ కూడా పుష్కరాలు జరుపుకొంటున్నారు.

శ్రీశైలానికి వరద నీటి ప్రవాహం పెరిగిన తరువాత హంద్రీనీవా ద్వారా కృష్ణా నీటిని రాయలసీమకు వదలగా.. ఆ నీరు జీడిపల్లి రిజర్వాయర్ కు వచ్చి చేరింది. దీంతో సమీప గ్రామాల్లోని ప్రజలు జీడిపల్లి జలాశయంలోనే కృష్ణమ్మకు పూజలు చేస్తూ, పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. వ్యయ ప్రయాసలతో విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లలేమని భావించే వారంతా ఇక్కడ స్నానాలకు వస్తుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జలాశయం లోపలికి వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

మరోవైపు కృష్ణా నది పుష్కర శోభను సంతరించుకున్న సందర్భంగా ఆ నది పరిధిలోని శ్రీశైలం జలాశయం నిండుకుండా కళకళలాడుతోంది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వరదల కారణంగా జలాశయానికి ఇంకా పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 150.81 టీఎంసీల నీరు చేరింది. ఇప్పటికీ జలాశయానికి 2,30,120 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 81,013 క్యూసెక్కుల నీటిని అధికారులు కిందకు వదులుతున్నారు. ఈ క్రమంలో జలాశయంలో నీటి మట్టం 872.1 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 . ఇలాగే ఇన్ ఫ్లో కొనసాగితే త్వరలోనే జలాశయం పూర్తిగా నిండుతుంది.