Begin typing your search above and press return to search.

కృష్ణా టీడీపీలో స‌మ‌న్వ‌య లోపం.. అంతుచిక్క‌ని నేత‌ల వ్యూహాలు

By:  Tupaki Desk   |   9 Jan 2021 2:30 AM GMT
కృష్ణా టీడీపీలో స‌మ‌న్వ‌య లోపం.. అంతుచిక్క‌ని నేత‌ల వ్యూహాలు
X
ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి బ‌ల‌మైన జిల్లాగా ఉన్న కృష్ణాలో నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. లెక్క‌కు మిక్కిలిగా నేత‌లు ఉన్నా.. ఎవ‌రికి వారే.. య‌మునా తీరే.. అన్న‌విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జిల్లాలో నేత‌లు కొంద‌రు వైసీపీ నేత‌ల తో రాజీ ప‌డుతున్నార‌నే వ్యాఖ్య‌లు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. మ‌రికొంద‌రు దూకుడుగా ఉన్నా.. స‌మ‌న్వ‌య లోపం కార‌ణంగా పార్టీ పుంజుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. విజ‌య‌వాడ ప‌రిస్థితిని తీసుకుంటే.. ఇక్క‌డ మూడు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో తూర్పులో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అదేవిధంగా ఎంపీ స్థానాన్ని కూడా పార్టీ కైవ‌సం చేసుకుంది.

దీనిని బ‌ట్టి.. విజ‌య‌వాడ న‌గ‌రంలో పార్టీ పుంజుకుంటుంద‌ని ఎవ‌రైనా భావిస్తారు. కానీ, మేయ‌ర్ పీఠంపై కీల‌క నేత‌ల మ‌ద్య ఏర్ప‌డిన వివాదం పార్టీకి చేటు తెస్తోంది. మేయ‌ర్ పీఠం మాకు కావాలంటే.. మాకు కావాలంటూ.. ఎంపీ, ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యేల మ‌ధ్య ప‌ట్టు పెరిగింది. ఈ విష‌యంలో చంద్ర‌బాబు క్లారిటీ ఇచ్చేసినా.. ఎన్నిక‌ల విష‌యంలో ఏర్ప‌డిన గ్యాప్ కార‌ణంగా.. మిగిలిన ఇద్ద‌రు నాయ‌కుల ఆశ‌లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఎవ‌రికి వారుగా లాబీయింగులు చేసుకుంటున్నారు. స‌రే.. ఈ విష‌యం వ‌ర‌కు ప‌రిమిత‌మై.. మిగిలిన విష‌యాల్లో అయినా ..దూకుడు చూపించాలి క‌దా.. అంటే.. ఇటీవ‌ల రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై పార్టీ అదినేత చంద్ర‌బాబు పిలుపు ఇచ్చి.. నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయాల‌ని చెప్పినా.. విజ‌య‌వాడ‌లో ఆ త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

ఇక‌, జిల్లా విష‌యానికి వ‌స్తే.. పెడ‌న టికెట్‌ను త‌న కుమారుడికి ఇవ్వాల‌ని మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ కోరుతున్నారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు మౌనం పాటిస్తున్నారు. దీనికి కూడా కార‌ణం ఉంది. పెడ‌న‌లో కాగిత వెంక‌ట్రావు కుమారుడు ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. ఆయ‌న యాక్టివ్‌గా ఉండ‌క‌పోగా.. ఇక్క‌డ నుంచి గెలిచిన వైసీపీ నాయ‌కుడు.. జోగి ర‌మేష్‌తో స‌ర్దుకు పోతున్నార‌నేది కొన‌క‌ళ్ల ఆరోప‌ణ‌. ఫ‌లితంగా ఈ నియోజ‌క‌వ‌ర్గ వివాదం నేప‌థ్యంలో అటు కాగిత కుటుంబం, ఇటు కొన‌క‌ళ్ల కుటుంబాల మ‌ధ్య ఏర్ప‌డిన వివాదం.. పార్టీకి చేటుగా మారింది. మ‌రోవైపు గుడివాడ‌లో మంత్రి నానిని ఢీ కొట్టే నాయ‌కుడు టీడీపీలో లేక‌పోవ‌డం మ‌రో కార‌ణంగా క‌నిపిస్తోంది. ఇక‌, తిరువూరులో ఇంచార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్‌.. త‌న‌కు ఇష్టంలేద‌ని ఆ ప‌ద‌విని వ‌దిలి పెట్టినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రినీ ఇక్క‌డ చంద్ర‌బాబు నియ‌మించ‌లేదు.

దీంతో ఇక్క‌డ ఎవ‌రూ పార్టీ బాధ్య‌త‌లు చూడ‌డం లేదు. అవ‌నిగ‌డ్డ‌లో మాజీ డిప్యూటీ స్పీక‌ర్ మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ రిటైర్మెంట్‌కు రెడీ అయ్యారు. అయితే.. ఈ టికెట్‌ను త‌న కుమారుడికి ఇవ్వాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు.కానీ, సీనియ‌ర్లు మాత్రం త‌మ‌కు ఇవ్వాల‌ని మ‌రోవైపు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. నూజివీడిలోనూ ఇలాంటి ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక్క‌డ వైసీపీ బ‌ల‌హీన ప‌డింది. ఎక్క‌డా అభివృద్ధి లేద‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీనిని అందిపుచ్చుకుని టీడీపీ బ‌లోపేతం చేసుకునేందుకు నాయ‌కులు ముందుకు రావ‌డం లేదు.

ఇక‌, పెన‌మ‌లూరులో బోడే ప్ర‌సాద్‌.. వైసీపీతో స‌ర్దుబాటు ధోర‌ణిలో ముందుకు సాగుతున్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యమేన‌ని టీడీపీ నాయ‌కులే చెబుతున్నారు. ఆయ‌న‌పై ఉన్న కాల్ మ‌నీ కేసు నేప‌థ్యంలో ఆయ‌న స‌ర్దుకు పోతున్నార‌ట‌. అదేవిదంగా గ‌న్న‌వ‌రంలో పార్టీ ప‌రిస్థితి అంతంత మాత్రంగా ఉంది. శ్రేణులు బలంగా ఉన్నా.. న‌డిపించే నేత లేక‌పోవ‌డం ఇక్క‌డ చిత్రంగా ఉంది. అయితే, ఒక్క మైల‌వ‌రంలో మాత్రం మాజీ మంత్రి దేవినేని ఉమా పుంజుకున్నారు. మొత్తంగా చూస్తే.. కృష్ణాలో బ‌ల‌మైన వ‌ర్గం ఉండి కూడా స‌మ‌న్వ‌య లోపం.. ఆధిప‌త్య రాజ‌కీయాల కార‌ణంగా టీడీపీ ప‌రిస్థితి ఇబ్బందిగా మారింద‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కు